ఫీలింగనేది రచనకు పునాది;- - యామిజాల జగదీశ్
 ప్రముఖ కవి, రచయిత గుంటూరు శేషేంద్ర శర్మకు నామకరణ వేళ పెట్టిన పేరు శేషభట్టు. ఆయన బంగారపు ఉంగరంతో బియ్యం మీద రాయించిన పేరిదే. అయితే అప్పుడు ఆయన పినతల్లి ఇంతటి ముతక పేరు పెడతారా అని శేషేంద్ర తండ్రి మీద విరుచుకుపడింది. కవి అయి ఉండి కూడా ఇలాంటి పేరు పెట్టడమా అని అనగానే బియ్యం మీద రాసిన శేషభట్టు అనే పేరును చెరిపేసి శేషేంద్ర శర్మ అని రాసి అందరికీ వినిపించారు ఆయన తండ్రి.
శేషేంద్ర శర్మ గురువుగారు నేతి కృష్ణమూర్తి. ఆయన శబ్దమంజరివంటి పుస్తకాలు శేషేంద్ర శర్మతో చదివించారు. ఆ తర్వాతి కాలంలో వావిలాల వేంకటేశ్వరశాస్త్రిగారి వద్ద తర్కాలంకారాలు చదువుకున్న శేషేంద్ర శర్మ ఉపనిషద్భాష్యాలు, వేదాంత పంచదశి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నెల్లూరులో హైస్కూలు వరకు చదవుకున్న శేషేంద్ర శర్మ గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చేశారు. అనంతరం మద్రాసు లా కాలేజీలో లా చదువుకున్నారు. 1945లో పెళ్ళి చేసుకున్నారు.
ఆయన రాసినది మొట్టమొదటగా విశాలాంధ్ర (దైనిక)లో క్షేమేంద్ర లేదా అశ్విని కలంపేరుతో అచ్చయ్యింది. ఆ రచన శీర్షిక -  ప్రపంచంలో ఎక్కడున్నా సరే....తొలిసారిగా ఈ రచన అచ్చయ్యినప్పుడు ఆయన ఆనందం పట్టరానిదైంది.
ఆయన తన కవిత్వం ద్వారా తన జీవితాలనుంచి ఏమిటో తన సుఖదు:లేమిటో తన స్వప్నాలేమిటో వ్యక్తపరిచారు.
ఆయన సినిమాలో రాసిన పాట ఒక్కటే ఒక్కటి. ఆ పాట ఇలా మొదలవుతుంది....
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని....
మళ్ళీ ఎందుకు సినిమా పాట రాయలేదని అడగ్గా ఆయన జవాబిస్తూ తాను కవినని, తనతో పాట రాయిస్తారా అని భిక్షాటన చేసే విదూషకుడ్ని కాదని అన్నారు.
మన భాషలో సున్న అంటే ఏమిటో చెప్తూ సున్నలో నుంచే కదా ఈ సమస్తం పుట్టిందంటారు.
సాహిత్యంలో నవల, నాటకం, కథ, కవిత్వం, ఇత్యాది సృజనాత్మక వాఙ్మయ ప్రక్రియలన్నీ ఉమ్మడిగా వర్తించే మాటేనన్నారు. అటువంటి సాహిత్యంలో ఒక ప్రక్రియా విశేషం కవిత్వం అని అన్నారు.
 మాటకొస్తే ఏ భాషలోనైనా కవిత్వం ఒకటే విశ్వజనీన ప్రక్రియ అని చెప్పారు. ప్రతిభావంతుడితో స్నేహం చేయాలంటే ప్రతిభ అవసరం లేదని, ప్రతిభ ప్రతిభాహీనుడిలోకి ప్రవహిస్తందని తెలిపారు.
నిజం దేవుడు ఎరుగు అన్నట్లు విరసం తననెందుకు ద్వేషించిందో తెలీదన్నారు.
జీవితానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని, జీవితం తల్లి అయితే సాహిత్యం శిశువు అని అన్నారు.
కవి పుట్టడని, పుట్టిన తర్వాత కవిగా రూపొందుతాడన్నది ఆయన అభిప్రాయం. కథ పుట్టాలంటే ప్రతీక పుట్టాలంటేనూ మనిషిలో ఫీలింగు ఉండాలన్నారు. అది పునాది అంటూ పక్కవాడు చస్తుంటే తన దారిన తాను పోయే ఈ దేశంలో ఏనాడో ఫీలింగు చచ్చినప్పుడు మంచి కథ పుట్టడమనేది కష్టమని శేషేంద్ర శర్మ ఓ మారన్నారు.

కామెంట్‌లు