కర్మ అంటే....!!;- - యామిజాల జగదీశ్

 కర్మ అంటే ఏమిటి అనే దానిని వివరిస్తూ ఒక గురువు తన శిష్యులకు చెప్పిన కథ ఇది.
ఒక రాజు ఓ ఏనుగుపై కూర్చుని సంచారం చేస్తున్నాడు.
అప్పుడు రాజు ఓ ప్రధాన వీధిలో ఓ దుకాణం దగ్గరకు వచ్చాక పక్కనే ఉన్న మంత్రితో "మంత్రివర్యా! నాకెందుకో ఈ దుకాణదారుడిని ఉరి తీయాలన్పిస్తోంది" అన్నాడు.
రాజు మాటలకు మంత్రి నిశ్చేష్టుడయ్యాడు.
ఎందుకలా అన్పిస్తోందో అని అడిగి తెలుసుకునేలోపు రాజు ఆ దుకాణాన్ని ముందుకు వెళ్ళిపోయాడు.
మరుసటిరోజు మంత్రి మాత్రమే ఒక్కడిగా ఆ దుకాణానికి వెళ్ళాడు.
ఏదో సహజంగా అడుగుతున్నట్లు "వ్యాపారం బాగా జరుగుతోందా?" అని అడిగాడు ముత్రి.
అందుకు దుకాణదారుడు ఎంతో బాధపడుతూ నీరసంగా జవాబిచ్చాడు గంధపు చెక్కలను అమ్మే అతను.
 "నా దుకాణానికి వినియోగదారులు వస్తారు. కానీ ఎవరూ కొనరు. గంధపు చెక్కల పరిమళాన్ని ఆఘ్రాణించి వెళ్ళిపోతారు.
మీ దగ్గర గంధపు చెక్కలు నాణ్యమైనవే. మంచి పరిమళమే అని ప్రశంసిస్తారు. అంతేతప్ప ఒక్కరూ కొనరు" అన్నాడు దుకాణదారుడు.
అతని మాటలకు మంత్రి విస్తుపోయాడు.
"ఈ దేశపు రాజు ఎప్పుడు మరణిస్తాడా?" అని ఎదురుచూస్తున్నానన్నాడు దుకాణదారుడు.
"ఎందుకలా?" అని మంత్రి అడిగాడు.
"ఏమీ లేదు. అతను మరణిస్తే అంత్యక్రియలకు గంధపు చెక్కలు  కావలసివస్తాయి. ఈ ఊళ్ళో నా దగ్గరే నాణ్యమైన గంధపు చెక్కలు దొరుకుతాయని చాలా మందికి తెలుసు. కనుక రాజు చనిపోయిన రోజు నా దగ్గర గంధపు చెక్కలు కొంటారు. ఆరోజు నా వ్యాపారం బాగా జరుగుతుందని నా ఆశ" అని జవాబిచ్చాడు దుకాణదారుడు.
అప్పుడు మంత్రికి ముందురోజు రాజు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
ఈ దుకాణదారుడి దురుద్దేశమే రాజుతో అలా మాట్లాడించిందని గ్రహించాడు మంత్రి.
ఎంతో మంచివాడైన మంత్రి ఈ విషయాన్ని ఎంతో తెలివిగా పరిష్కరించాలనుకున్నాడు.
తానెవరన్నది చెప్పకుండా మంత్రి ఆ దుకాణదారుడి దగ్గర కొన్ని గంధపు చెక్కలు కొన్నాడు.
అనంతరం మంత్రి ఆ గంధపు చెక్కలను తీసుకుపోయి రాజుకి ఇస్తూ "రాజా! నిన్న మీరు ఎవరినైతే ఉరి తీయాలనుకున్నారో ఆ దుకాణదారుడే ఇప్పుడీ గంధపు చెక్కలను మీకు కానుకగా ఇవ్వమన్నాడు" అని చెప్పాడు.
రాజు ఆ చెక్కల పరిమళాన్ని ఆఘ్రాణించి తన్మయం చెందాడు.
ఆ దుకాణదారుడిని ఉరితీయాలనే ఆలోచన తనకొచ్చినందుకు లోలోపల సిగ్గుపడ్డాడు రాజు.
ఆ దుకాణాదారుడికి కొన్ని బంగారునాణాలు ఇవ్వమని మంత్రిద్వారా పంపించాడు.
మంత్రి ఆ బంగారు నాణాలను ఇస్తూ రాజుగారు నీకివి కానుకగా ఇమ్మన్నారన్నాడు.
అందుకా దుకాణదారుడు ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, రాజు వందేళ్ళుగా చల్లగా ఉండాలని నిండు మనసుతో చెప్పాడు. ఆ బంగారునాణాలు అతని ఇబ్బందులను తీర్చింది. రాజు చస్తే బాగుంటుందనుకున్నందుకు బాధపడ్డాడు దుకాణదారుడు.
కథనిలా ముగిస్తూ "శిష్యులారా! ఇప్పుడు చెప్పండి, కర్మ అంటే ఏమిటో?" అని అడిగాడు గురువు.
అప్పుడు శిష్యులు పలురకాలుగా జవాబిచ్చారు.
కర్మ అనేది మన మాటలు. మన చర్యలు. మన బాధ్యతలు అంటూ రకరకాలుగా చెప్పారు శిష్యులు.
అందరూ చెప్పడమయ్యాక గురువు "కర్మ అనేది మన ఆలోచన... “ అన్నాడు.
మనం ఇతరులపై మంచి అభిమానంతో ప్రేమతో ఆలోచనలు చేస్తే అవి మనకు ఏదో రూపంలో మంచినే చేస్తాయి. అలాకాకుండా మనం ఇతరులను చెడుగా ఆలోచిస్తే ఆ దురాలోచనలు మనల్నేదో విధంగా నష్టపరుస్తాయి. ఊహించనిరీతిలో ఇబ్బందులు ఎదురవుతాయి" అన్నాడు గురువు.
మనం దేన్నయితే వెతుకుతామో అదే దొరుకుతుంది. మనమేదనుకుంటామో అదే జరుగుతుంది. కనుక మంచినే తలుద్దాం. మంచే జరుగుతుంది.

కామెంట్‌లు