కష్టాలు,కడగళ్ళు, ఎన్నెన్నో సవాళ్లు.దిన దినమూ ప్రతి దినమూ ఒక యుగముగా గడిచిన రోజుల నుండి, ప్రతి రోజూ శుభదినమనే స్థాయికి ఎదిగారు ఈ పిల్లలు.
వెల్దండ ఉన్నత పాఠశాల లో 2007-2008లో పదవతరగతి చదివిన ఈ విద్యార్థులందరూ చదువుతో పాటు, బ్రతుకు పాఠాన్ని నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి, తమ జీవితంలో ఎదురయిన ఒక్కో సుడిగుండాన్ని ఎలా దాటుకుంటూ వచ్చారో తెలియజేస్తూ,అనుభవమనే పాఠంతో ఎదిగిన తీరును పంచుకున్నారు.
తమ సహ విద్యార్థులందరినీ ఆహ్వానించి గత స్మృతులను నెమరు వేసుకుంటూ,ఉపాధ్యాయులను సగౌరవంగా సత్కరించుకున్నారు.
చదువంటే వంద మార్కులు కాదు, వందేళ్ల జీవితమని పదే పదే చెప్పిన మా మాటలను ఒంటబట్టించుకొని ఉన్నత స్థానానికి ఎదిగి,తమ అభివృద్ధిని కాంక్షించిన ఉపాధ్యాయులకు కానుకగా ఇచ్చారు.
ఇందులో పోలీస్ లు ఉన్నారు.అత్యున్నతమైన రక్షణ విభాగంలో పనిచేసిన వారున్నారు.కష్టపడి చదివి, ఎదిగిన ఇంజనీర్లు ఉన్నారు.పెద్ద పెద్ద కంపెనీలలో మేనేజర్ గా పనిచేసేవాళ్ళున్నారు.స్వయం కృషితో ఎదిగి,తమ తోటి వారికి సహకరించే మానవీయులు ఉన్నారు.
ముఖ్యంగా తరగతి గదిలో అతి సాధారణ విద్యార్థి అనిపించుకున్న అనిల్, ఈరోజున అందరికంటే ముందుగా తన జీవితానికి అనుభవ పాఠాలను జోడించి,బ్రతుక నేర్చే తెలివిని పెంపొందించి ఆర్థికంగా బలమైన పునాదిని వేసుకొని, సుందరమైన జీవిత భవనాన్ని నిర్మించుకున్నాడు. ఇక తల్లి తండ్రి, కుటుంబం మొత్తాన్ని కోల్పోయి,బంధువుల చెంతన పెరిగి,అనుబంధాల ఆత్మీయత కోసం అల్లల్లాడిన రమేష్ స్వయం శక్తితో ఎదిగి, తనను తాను నిరూపించుకున్నాడు.
అత్యంత సౌమ్యుడిగా పేరుపొందిన ప్రశాంత్, తల్లిని కోల్పోయిన తరువాత తనలో తానే విపరీతమయిన ఆవేదనకు లోనయినా, తిరిగి శక్తిని కూడదీసుకుని ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రోది చేసుకున్నాడు.
ఒక మారుమూల తండా నుండి ఐ.ఐ.టి.బాసరకు వెళ్లి విద్యనభ్యసించిన ప్రవీణ్, తదనంతరం ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని, తనలోని వినయ విధేయతలను సడలనీయకుండా ఎదిగి,ఇంజనీర్ గా స్థిరపడ్డాడు.
చదువులో ముందుండే శ్రీను, రాజలింగం రక్షణ దళంలో చేరి,ఉన్నత స్థాయిలో నిలిచినా తమలోని వినయ సంపదను తరగనీయలేదు.
కష్ట కాలంలో ఒకరికొకరు తోడుగా ఉండి,స్నేహ హస్తాన్ని అందించి, బ్రతుకు బాటను పూలబాట చేసుకున్నారు.
వీరి స్థాయిలోనే దివ్య బజాజ్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తూ, తనను తాను నిరూపించకుంటుండగా, శోభ సైతం బ్యాంకు లో పనిచేస్తూ తన తల్లిదండ్రులను, గురువుల వలనే తాను ఈ స్థానంలో ఉన్నానని తెలిపినది.
అందమైన కళలతో బడిలో రాణించిన భార్గవి,టి.టి.సి.చేసే సమయంలోనూ తన ప్రత్యేకతను చాటుకొని, గురువులను గౌరవించుకోవాలనే తన బలమైన కోరికను తన మిత్రబృందం ద్వారా ఈరోజు నెరవేర్చుకొన్నది.ఈ అమ్మాయితో పాటే జంట పక్షిగా తిరిగిన సుష్మ సైతం తనలోని వినయ విధేయతలతో అందరినీ ఆకర్షించినది.
అడుగడుగున ఎదురయిన అనేక రకాల కష్టనష్టాలను చవిచూసి, ఈరోజు బెల్ కంపెనీలో ఇంజనీర్ గా పని చేస్తున్న సాయి,ఎప్పుడో పదహారేళ్ళ క్రితం వారి పదవతరగతి లో నేను చెప్పిన పద్యాన్ని వినిపించి బహుమతిగా అందజేసిన దివాకర్, కార్యక్రమానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించిన కొండ రాజు,వస్త్ర ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను రూపొందించుకున్న శిరీష.అన్నదాతలుగా ,రైతన్నలై నిలిచిన విద్యార్థులు ఎందరో ఈ సమూహంలో ఉన్నారు.
కానీ వీరెవరూ లక్షలకు లక్షలు వెచ్చించి చదువుకున్న వారు కాదు.ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ బడిలో చదువుకున్న వారే.
బడిలో నేర్చుకున్న పాఠాలతో పాటు, బ్రతుకు పాఠాన్ని అర్థం చేసుకొంటూ సమస్యలకు ఎదురు నిలిచి, భయపడకుండా పోరాడి,ప్రగతికి చేరువయినారు.
ప్రభుత్వ బడిలో ఏముంది? అని ప్రశ్నించే వారికి సమాధానంగా నిలిచారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి