శంకరరావు ఆదర్శం- అందరికీ స్పూర్తిదాయకం

 శంకరరావు మాస్టారు విద్యార్థులకు ఉచితంగా ఒరవడి పుస్తకాలు పంపిణీ గావించుట గొప్ప మానవత్వంతో కూడిన సహకారమని, ఈ త్యాగం ఎందరెందరికో మార్గదర్శకత్వమని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. నేడు యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. సేవాభావ స్వభావి తెలుగు భాషోపాధ్యాయులు ముదిల శంకరరావు వంటి వ్యక్తులంతా నిజమైన దేశభక్తులని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకూ గల సుమారు రెండు వందల మంది విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం ఒరవడి పుస్తకాలను ఉచితంగా అందజేసిన  శంకరరావును ఆయన మిక్కిలి అభినందించారు. పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది కార్యదర్శి నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ కార్యదర్శి తూతిక సురేష్ మాట్లాడుతూ పాతిక వేల రూపాయల ఖర్చు వెచ్చించి విద్యార్థుల కోసం పరితపించుటతో శంకరరావు మనందరికీ గర్వకారణంగా నిలిచారని అన్నారు. ఎల్లప్పుడూ పాఠశాల ప్రగతికి, విద్యార్థుల విద్యా స్థాయి మెరుగుదలకూ శంకరరావు అదనపు తరగతులను నిర్వహిస్తూ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ పాఠశాల పునః ప్రారంభమైన తొలివారంలోనే విద్యార్థులను ఇలా ప్రోత్సాహించడం వలన వారిలో చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుందని, ఉచితంగా పుస్తకాల్ని బహూకరించిన ముదిల శంకరరావు మిక్కిలి ఆదర్శప్రాయులని అన్నారు. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ దినోత్సవ వేడుకల్లో భాగంగా బడిపిల్లలకు ఇలా సాయమందించుట విశేషమని అన్నారు. విరాళదాత శంకరరావు మాట్లాడుతూ విద్యార్థి సత్ఫలితాలకు తొలి సోపానం దస్తూరీ రాత అని, కుదురైన రాతవలన మనసు కుదుటపడి చదువుకోవడానికి శ్రద్ధాసక్తులు ఏర్పడునని అన్నారు. విద్యార్థి పరీక్షల్లో మార్కులు సాధించుటలో ఈ అందమైన చేతిరాత ప్రాముఖ్యత వహిస్తుందని, అందుకే ఒరవడి పుస్తకాలను ఉచితంగా బహూకరిస్తున్నానని అన్నారు. 
వీటిని సద్వినియోగపర్చుకొని లేఖన నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థులకు శంకరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబి కుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు సామాజిక సేవా దినోత్సవ ప్రాధాన్యతను తెల్పి, సేవాతత్పరతా అంశాలను తమ తమ ప్రసంగాలలో వివరించారు.
కామెంట్‌లు