సత్యమేవ జయతే;-సి.హెచ్.ప్రతాప్
 సత్యమేవ జయతే- ఇది మన జాతీయ నినాదం. ఈ నినాదాన్ని ఉత్తర ప్రదేశ్, సారనాధ్ లోని అశోకుడి ఏక సింహ రాజధాని నుండి సేకరించారు. ఈ నినాద మూలాలు ముండక ఉపనిషత్తు లోని మంత్రం నుండి గ్రహించారు.
జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమంతి ఋషయో హి ఆప్తాకామా
యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్॥
‘సత్యం ఒక్కటే జయిస్తుంది. దైవాన్ని చేరుకునేందుకు ఆ సత్యంతోనే మార్గం ఏర్పడుతుంది. నిష్కామమైన రుషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు,’ అన్నదే పై శక్లోకంలోని భావం.
సత్యమేవ జయతే’ నినాదాన్ని జాతీయ బోర్డులోకి తీసుకురావడంలోనూ, ప్రచారం చేయడంలోనూ పండిట్ మదన్ మోహన్ మాలవ్య కీలక పాత్ర పోషించారు.సత్యమేవ జయతే సూత్రం ముండక ఉపనిషత్తు నుండి గ్రహించారు. ‘సత్యమేవ జయతే’ అనే పదాన్ని జాతీయ చిహ్నంలో నినాదంగా చేర్చారు.
దీనిని వ్యక్తిగతంగా ఉపయోగించలేరు.భారతీయ నోట్లు, నాణేలపై జాతీయ చిహ్నం అశోక స్తంభంతో పాటు ఈ నినాదం కూడా కనిపిస్తుంది.సత్యమనేది ఒక్కటే ‘పరబ్రహ్మ స్వరూపం’. ధర్మమనేది సత్యవాక్కులోనే ఉంటుంది. ధర్మాచరణకు ఇదే ఆధారం. వేదాలన్నీకూడా ఈ సత్యాన్నే ప్రతిపాదించాయి. ఈ సత్యం వల్లే మోక్షం సిద్ధిస్తుందికూడా. నిజం చెప్పడం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం, ధ్యానం చేయడం, పరిశుభ్రంగా ఉండటం, సంతోషమూ, జాలి, అభిమానమూ, సహనమూ, జ్ఞానమూ, మనోనిగ్రహమూ అనే వాటితోపాటు నిక్కచ్చిగా ఉండటమనే సద్గుణాలను అందరూ అలవరచుకోవాలని మన సనాతన ధర్మం.సత్యనిష్ఠులే గెలుస్తారు. అసత్యవాదులు నెగ్గరు. పరమార్థ తత్త్వం అవగతం కావాలంటే సత్యసంధతని వ్రతంగా స్వీకరించాల్సిందే. ఎన్నటికైనా నిజాన్ని నమ్ముకున్న వాళ్ళనే విజయం వరిస్తుంది. 

కామెంట్‌లు