సుప్రభాత కవిత ; - బృంద

గ్రీష్మ తాపము కరిగిన వేళ
చినుకు ముత్యాల నాట్యహేల
తరువుకు తరగని సంతోషం
కరువు తీరిన వర్షాగమనం...

పచ్చని తీగల సంబరమెందుకో!?
నీటిని చేరగా ఆత్రమదేమో!
అద్దాన చూసిన అనురాగం
ముద్దాడ మనసున అభిమానం..

నచ్చిన మనసుతో ఊగెనదివో
వెచ్చని ఊసుల  ఊయల
వాన చినుకులతో రాయబారం
లోన పొంగెను ప్రేమసరాగం

నీ వేదనలో ఓదార్పుగా
నీ చెంతనే వుండాలనీ
నీ వేడుక చూడాలనుకుని
నీ నీడగ మారాలనీ

నా  చిన్ని మదిలో కోరిక
ఇన్నిరోజులకు తీరినదంటూ
మమతలు కురిపిస్తూ
మౌనంగా చూసెనేమో తీగ!

నింగికి నీటితో స్నేహం
తోటకు తేటితో నెయ్యం
గాలికి గంధపు కూరిమి
భూమికి హరితమే అందం...

ప్రకృతి సమస్తం ప్రేమ మయం
పంచినంతా దొరకును కాదా!
వంచన లేని మంచితనమే
పుడమిని దొరికే అమృతవరం!

చినుకుల ముత్యాల సరులు
చుట్టిన కిరణాల రాకను
విడువక పట్టి వుంచేలా
ఆహ్లాదంగా అహ్వానిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు