సుప్రభాత కవిత ; - బృంద
నింగి లోని నీలమంతా
లోన దాచిన నీటిలో
రంగులీను రాళ్ళను
తొంగి చూచు కాంతులు

కొండ కోనల దాపున
ఏటి పాయల మీద
నిండుగా కురియు 
బంగరు ధారలు

ఎక్కడో  దూరాన ఎత్తైన గగనాన
చుక్కబొట్టులా వెలుగుతూ
ఎదిగి పైపైకి పాకుతున్న
వెలుగుల బంతి వైభవాలు

కాంతికలశపు రాకతో
కళకళలు తొణికిసలాడ
పుడమి నిండుగ వెల్లివిరిసే
పండుగంటి సంబరమేదో!

కమ్మని కబురంటూ 
మలయమారుతము
ఊపి చెప్పిన కబురు విని
ఊగుతూ స్వాగతించె కొమ్మలన్నీ

రేపటికి చేరుకోవాలని
మాపంతా ఎదురుచూసి
కోటి కోరికల కొంగున కట్టుకుని
చూపులు దారిని పరిచి చూచె భువి

ప్రియమైన సంగతులు
పాలమబ్బుల పల్లకీ ఎక్కి
వెలుతురు ముగ్గేసిన ముంగిలి 

గుమ్మాన  ముద్దుగా మొహరించే

ముచ్చటైన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు