మూర్ఖులతో వాదన తగదు ;- - యామిజాల జగదీశ్
 అనగనగా ఒక రోజు గాడిద పులితో  చెప్పింది  "గడ్డి నీలంగా ఉంది" అని.
కానీ పులి "నువ్వు చెప్పింది సరికాదు. గడ్డి పచ్చగానే ఉంది...ఉంటుంది" అంది.
 వాటి మధ్య వాదన వేడెక్కింది. రెండూ ఎవరిది సరైనదో తేల్చుకోవడం కోసం మృగరాజు సింహం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అవి వెళ్ళే సమయానికి సింహం ఎప్పట్లాగే గంభీరంగా కూర్చుని ఉంది. 
"ఏమిటీ పొద్దున్నే వచ్చారిద్దరూ? ఏమైంది?" అని అడిగింది సింహం.
అప్పుడు గాడిద మొదలు పెట్టింది చర్చను.
"రాజా! నువ్వే మా తగవు తీర్చాలి. గడ్డి వంగు నీలమేగా" అని అడవంతా వినిపించేలా కర్ణకఠోరంగా అరిచింది. 
సింహం "అందులో అనుమానమేముం ది...నువ్వు చెప్పిందే నిజం... గడ్డి నీలంగానే ఉంటుంది." అంది.
అయితే గాడిద "నువ్వు నా మాటతో ఏకీభవిస్తున్నావు. కానీ ఈ పులి నాతో ఏకీభవించలేదు. పైగా నాకు విరుద్ధంగా ఉంది. అది నా మనసుని నొప్పించింది. గడ్డి పచ్చ రంగు అని చెప్తోంది. నువ్వే దానిని  శిక్షించాలి." అంది
అప్పుడు మృగరాజు "పులి అయిదేళ్ళపాటు మౌనంగా ఉండాలి" అంటూ శిక్ష విధించింది.
మృగరాజు మాటతో గాడిద ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఉల్లాసంగా దూకుతూ తన దారిన పోయింది.
అప్పటి వరకు మౌనంగా ఉన్న పులి
 సింహాన్ని అడిగింది...
 "రాజా, నన్నెంందుకు శిక్షించారు? గడ్డి పచ్చగానే కదా ఉంటుంది." అని.
అంతట సింహం చెప్పింది "ఔను. నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం. గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది...అందులో అణువంత అబద్ధం లేదు" అని.
 పులి "అయితే నన్నెంందుకు శిక్షింంచావు?"
అని అడిగింది.
సింహం “గడ్డి నీలమా, పచ్చనా అనే ప్రశ్నకు సంబంధం లేదు.. గాడిదతో వాదిస్తూ కాలాన్ని వృధా చేయడం నీలాంటి ధైర్యవంతుడికి తెలివిగల ప్రాణికి అనవసరం. ఆ క్షణాన ఈ తగవుకి తెర దిఉచడం కోసం నిన్ను శిక్షిస్తూ తీర్పు చెప్పాను. అంతకన్నా మరొకటి కాదు" అంది. 
నిజం లేదా వాస్తవికత గురించి పట్టించుకోని మూర్ఖులతో వాదించడంవల్ల మనం అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటాం. మూర్ఖుల విజయం విజయం కానే కాదు. వారు సాధించామనుకున్న విజయం ఊహలకే పరిమితం. వారి నమ్మకాలు అర్థంపర్థం లేనివి.  అటువంటి అర్థం లేని వాదనలకు సమయాన్ని వెచ్చించడం వృధా.... మనం ఎన్ని సాక్ష్యాలు సమర్పించినా అర్థం చేసుకోలేని వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు. 
మరికొందరికి అహం, ద్వేషం, పగతో కళ్ళుమూసుకుపోతాయి.  అజ్ఞానం అరుస్తున్నప్పుడు, తెలివితేటలనే జ్ఞానం మౌనంగా ఉంటుంది. అటువంటి సమయాలలో మీ శాంతి,  నిశ్శబ్దం మరెంతో  విలువైనవి అని గ్రహించాలి.

కామెంట్‌లు