'శంభో!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 (కందములు )
===========
71.
వెలిగించితి దీపములను
మలిసంధ్య సమయము నందు మక్కువ తోడన్
నిలిచితి బూజలు చేయుచు
బులకించితి నిన్ను దల్చి ముదముగ శంభో//

72.
అగణిత గుణ గణ శీలా!
నగజాపతి శంకర!నిను నమ్మితి నయ్యా!
నగుమోమును జూపర!నిను
సుగతిని గోరి యజియింతు శుభమిడు శంభో!//

73.
పున్నమి వేళల నీకై
చెన్నుగ బూజలు సలుపగ జేరితి నయ్యా!
కన్నుల జూడగ గోరితి
బన్నగ భూషణ!ననుగని వరమిడు శంభో!

74.
తెలతెల వారక మునుపే
తిలకింపగనీదు రూపు దేవళ మందున్
నిలిచితి నయ్యా!సరగున
పిలుపును విని దరిసెన మిడు ప్రేమగ శంభో!//

75.
ప్రమధులు కైలాసంబున
ఢమఢమ నాదములు సలుప ఢక్కల తోడన్
డమరుకమును జే బట్టుచు
ధిమిధిమి యని నాట్య మాడు దేవర శంభో!//

కామెంట్‌లు