'అంతర పంటలతో అధిక లాభాలు';--ఎస్ఎల్ఎం ప్రాజెక్టు మేనేజర్ సతీష్ కుమార్

  ప్రధాన పంటలో రైతులు అంతర పంటలు వేసుకోవడం వల్ల అధిక లాభాలను సాధించవచ్చని బిసిఐ ఎస్ఎల్ఎం ప్రాజెక్ట్ మేనేజర్ సతీష్ కుమార్ అన్నారు. డబ్ల్యూ డబ్ల్యూఎఫ్ బిసిఐ కేశవాపూర్ ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రీజనరేటివ్ అగ్రికల్చర్ లో భాగంగా   సోమవారం కాల్వశ్రీరాంపూర్  మండలంలోని పందిళ్ళ గ్రామంలో పచ్చిరొట్ట ఎరువు తయారు చేసుకోవడంలో మెకువలను ఆయన రైతులకు వివరించారు. గత నెల క్రితం సీర కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో నవధాన్యాలు చల్లడంతో ఏపుగా పెరిగిన మొక్కలను ఆయన తన సిబ్బంది, రైతులతో కలిసి పరిశీలించారు. గుబురుగా పెరిగిన నవధాన్యాల మొక్కలతో పచ్చిరొట్ట తయారు చేసే విధానాన్ని రైతులకు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ...పప్పు జాతి విత్తనాలతో పచ్చిరొట్ట ఎరువు తయారు చేసుకోవడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి, అధికంగా పంట దిగుబడులు వస్తాయన్నారు. పచ్చిరొట్ట తయారు చేసుకోవడం వల్ల భూసారం పెరుగుతుందని, రైతులు పూర్తిగా రసాయనక ఎరువుల వాడకం తగ్గించాలని ఆయన సూచించారు. పచ్చిరొట్టతో  ఎరువుల తయారీ అనేది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని, ఇది 'పర్యావరణహితకారి' అని సతీష్ కుమార్ తెలిపారు. పత్తితో పాటు ఇతర ప్రధాన పంటల్లో పెసరు, కందిని అంతర పంటలుగా వేయడం వల్ల రైతులు అధిక దిగుబడిన సాధించవచ్చని, ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీఐ యూనిట్ మేనేజర్ సాయి ప్రకాష్ రెడ్డి, ప్లాంటేషన్ ఇంచార్జి విష్ణు, ఫీల్డ్ ఇంచార్జ్ తూండ్ల అరుణ, బిసిఐ సిబ్బంది, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు