'శంభో!'శతకపద్యములు ;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 (కందములు ).
===========
61.
 తరతరములు నీ సేవల
దరియించిరి మా పితరులు ధన్యత నొందన్
నిరతము నిను గొల్చెడి మా
పరివారము వంక జూడు భవహర!శంభో!//
62.
మరుమల్లెల మాలల తో
మురిపెముగా పూజ సల్ప ముచ్చట పడుచున్
పఱుగున వచ్చితి నయ్యా!
తెరువర!వాకిలి సరగున!దేవర!శంభో!//
63.
మూలము నీవట జగతికి
నాలుగు వేదంబులు నిను నయముగ బొగడన్
గాలాకృతిగా దిరిగెడి
ఫాలాక్షా!మదిఁ దలిచెద భక్తిగ శంభో!//
64.
 రామేశ్వర సాంబ!శివా!
నీమముగా నిన్ను గొల్తు నెఱవుగ భర్గా!
కామితములు దీర్పవె రు
ద్రా!మన సారగ దలచెద రహినిడు శంభో!//
65.
మరు భూమియె వాసముగా
పరలోక గతులను గాచు బైరాగీ నీ
చరితము లేవిని సొక్కుచు
బరిపరి విధముల నుతింతు ప్రణతుల శంభో!//

కామెంట్‌లు