ఎవడయ్యవాడు!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఇరువదినాలుగు గంటలు
ఆలోచనలలో తేలువాడు
మంచి విషయాలకొరకు
ముప్పొద్దులా కాచుకొనెడివాడు
ఎవడయ్య వాడెవడు?
ఇంకెవరు మనకవిగారతడు!

ఎల్లప్పుడూ కలమును
చెంతనే ఉంచుకొనెడివాడు
తెల్లకాగితాలు పక్కనుంచుకొనెడివాడు
నల్లగీతలను గీసెడివాడు
ఎవడయ్య వాడెవడు?
ఇంకెవరు మనకవిగారతడు!

అక్షరాలను వెతికిపట్టుకొనువాడు
పదాలను ప్రీతితోపొసుగువాడు
పంక్తులను ప్రాసలతోకూర్చువాడు
చరణాలను చక్కగాచేర్చువాడు
ఎవడయ్య వాడెవడు?
ఇంకెవరు మనకవిగారతడు!

పద్యాలను పసందుగాపేర్చువాడు
వచనకవితలను విరివిగావ్రాసెడివాడు
గేయాలను గటగటావినిపించెడివాడు
శారదాదేవికి ప్రీతిపాత్రమైనవాడు
ఎవడయ్య వాడెవడు?
ఇంకెవరు మనకవిగారతడు!
 
సాహితీసమ్మేళనాలలో పాల్గొనువాడు
శ్రావ్యంగా కవితలుపాడువాడు
శాలువాలు భుజానకప్పెంచుకొనెడివాడు
సన్మానసత్కారాలకు పొంగిపోయెడివాడు
ఎవడయ్య వాడెవడు?
ఇంకెవరు మనకవిగారతడు!


కామెంట్‌లు