శంభో!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 కందపద్యములు.
============
26.
 మురిపెము దీర గుమారులు 
పరిచర్యలు జేయుచుండ పార్వతి తోడన్ 
నిరతము భక్తుల బ్రోచెడి 
సురవినుతా !నిను గొలిచెద శుభమిడు శంభో !//
27.
 దక్షుని మద మడచిన భవ !
బిక్షువుగా దిరిగెద వట !వెతలను దీర్పన్ 
రక్షణ నిడుమా !లోకా 
ధ్యక్ష !శివా !నిను సతతము దలతును శంభో !//
28.
 నిర్గుణ! నిరాకుల !శివా !
భర్గుడ !నీ పద యుగళము బట్టితి నయ్యా !
దుర్గుణ హరణా !శంకర !
సర్గుడ !నిను నే దలిచెద సతతము శంభో !//
29.
గంగా దేవిని శిరమున 
సింగారముగా నిలిపిన చిన్మయ రూపా !
జంగమ దేవర !నీకై 
పొంగుచు నిరతము సలిపెద బూజలు శంభో !//
30.
దిక్కని దల్చితి నిన్నే 
మ్రొక్కెద నీపద యుగళము మోదము తోడన్ 
సొక్కుచు నీ నామము నే 
మక్కువ మీరగ భజింతు మరువక శంభో !//

కామెంట్‌లు