సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -538
తరంగ న్యాయము
   *****
తరంగం అనగా అల, కెరటం,గ్రంథ భాగము,దుముకు,గంతు అనే అర్థాలు ఉన్నాయి.
సముద్రములో అలలు ఒకదాని వెనుక ఒకటి విడువకుండా వస్తూనే ఉంటాయని అర్థము.
సముద్రము ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు.ఎగిసిపడే అలలతో క్షణమైనా నిలకడ లేకుండా అస్థిమితంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది.
 అలాగే మనిషి మనసు కూడా. ఆలోచన వెంట ఆలోచన ఒకదాని వెనుక ఒకటి ఆగకుండా వస్తూనే ఉంటుంది.అందుకే మనిషి మనసును మహా సముద్రంతో పోల్చి చెబుతుంటారు.
 సముద్రములో అలలు ఎందుకు వస్తాయో మరోసారి మననం చేసుకుందాం.సాధారణంగా సముద్రము యొక్క ఉపరితలంపై వీచే గాలుల శక్తి వల్ల అలలు కలుగుతాయి.గాలి మరియు ఉపరితల నీటి మధ్య జరిగే ఘర్షణ ద్వారా అలలు సృష్టించబడతాయి.
అంతే కాదు సముద్రంలో నీటి మట్టం పెరుగుతూ తరుగుతూ వుంటుంది. దీనికి ముఖ్యంగా సూర్య చంద్రుల గురుత్వాకర్షణ శక్తి కారణమవుతుంది . అయితే సూర్యడి కంటే చాలా దగ్గరగా చంద్రుడు ఉండటం వల్ల చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎక్కువగా వుండి ఆటుపోట్లు సంభవిస్తుంటాయి.
అందువల్ల అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతూ తీరానికి సమీపంలోకి రావడం, లేదా సముద్రం నుంచి లోపలికి వెళ్ళి పోవడం జరుగుతుంది.
అలాంటి అలల సందడిని  సముద్ర తీరప్రాంతంలో నిలుచుని  ఎన్ని సార్లు చూసినా కొత్తదనంతో పాటు  ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఉవ్వెత్తున లేచి ఒడ్డున కుప్పకూలి పోతుంటే మనసులో రకరకాల భావోద్వేగాలు ముప్పిరిగొంటుంటాయి.ఆ హోరు మనే శబ్దము,తీరం చేరాలని తపన పడే అలలు, తీరం చేరలేక కొన్ని,తీరం చేరి విజయోత్సాహంతో చెలియలి కట్టను ముద్దాడేవి కొన్ని.... వాటినలా చూస్తూ ఉంటే ఎదలో సైతం పరిపరి ఆలోచనా తరంగాల అలజడి మొదలవుతుంది.కష్ట సుఖాలను సముద్రునితో పోల్చుకుని హృదయం సాంత్వన పడుతుంది .
అంతే కాదు  భక్తులు సముద్ర ఘోషలో ఓంకారం వినబడుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వినండి అంటుంటారు.మానసిక వైద్యులు ఒక్క సారి ఉషోదయంలోనో సాయం సంధ్యలోనో సముద్ర తీరానికి వెళ్ళండి "ఆ అలల హోరు - వీచే చిరుగాలి తీరు- అలలపై ప్రతిఫలించే సూర్యుని కిరణాలు.. మనసును హాయిగా తాకుతుంటాయి. నిరాశా నిస్పృహలు మటుమాయమై నూతనోత్తేజం వస్తుంది" అంటుంటారు.
అలా మైమరిపించే సముద్రం - తరంగాలకు మనసుకు అవినాభావ సంబంధం కలిగి ఉంది.
మనసూ - అందులోని ఆలోచనలు. తీరేవి,తీరనివి కలవరపెట్టేవి.కలలో సైతం ఆశ్చర్యానికి గురి చేసేవి.ఇలా ఎన్నో  ఆలోచనా తరంగాలు మనిషిని జీవితాంతం వీడి పోకుండా వస్తూనే ఉంటాయి.
 అందుకే మన పెద్దవాళ్ళు పూర్వీకులు తరంగాలకు సంబంధించి ఏకంగా ఓ "తరంగ న్యాయము"నే సృష్టించారు.
 ముఖ్యంగా "తరంగ న్యాయము"ద్వారా మనసులోని ఆలోచనలు - సముద్రములోని కెరటాలు ఎంత అణచి వేసినా ఆగవనీ.మనలోని కోరికలు, ఆశలు,ఆశయాలను తరంగాల వలెనే తీరం చేరాలని తపన పడుతూ వుంటాయనీ, అందులో ఉత్తాన పతనాలూ, జయాపజయాలు ఉంటాయనేవి ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయాలు.
అలలు లేని నదిలో ప్రయాణం తేలికగా వుంటుంది. అలలు ఉన్న సంద్రంలో  ప్రయాణం ఓ సవాల్ అవుతుంది.అలలు లేని సంద్రం ఆలోచనలు లేని మనిషి ఉండడు కాబట్టి , మనదైన గమనంతో గమ్యాన్ని చేరేందుకు ప్రయాణాన్ని సవాల్ గా తీసుకుని జీవన తీరాన్ని ఆనందంగా చేరుదాం .

కామెంట్‌లు