అవయవ దానం ప్రాముఖ్యత;- సి.హెచ్.ప్రతాప్
 ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవయవ దానం చేసే దేశాల్లో భారత్‌ ఒకటిగా కొనసాగుతోంది. భారతదేశంలో, అవయవ దానం రేటు చాలా తక్కువగా ఉంది.అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రపంచంలోని 195 దేశాల్లో సుమారు నాలుగున్నర కోట్లమంది అంధులే. మన దేశానికి ప్రతి ఏడాదికి సుమా రు మూడు లక్షల మంది నేత్ర దాతల అవసరమున్నది. కానీ అతికష్టం మీద యాభై వేల మంది మాత్రమే లభిస్తున్నారు. మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నా, అవయవదానం చేసేవారి సంఖ్య ఆ స్థాయిలో ఉండటం లేదు. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు గల సాంప్రదాయపు ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహనాలోపం తదితర కారణాల వల్ల నేత్రదానం చేయడానికి అందరూ అంగీకరించకపోవడం వల్ల పవిత్రమైన అవయవదాన ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.అవయవ దానం మానవ శరీర పరిశోధన కు ఉపకరిస్తుంది. వైద్య విద్యార్థులకు శరీరం లోని అవయవాల పని తీరుపై అవగాహన కల్పిస్తారు. వైద్యశాస్త్ర అభివృద్ధికి ఉపకరిస్తుం ది. అవయవ దానం ద్వారా కొత్త జీవితం లభిస్తుంది.అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయ డం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు. వయవదానంపై అన్ని రంగాల వారికి మరింత అవగాహన కల్పించాలి. మరణించిన వారి పార్థివదేహాలను వైద్య కళాశాలలకు అందించేలా ప్రోత్సహించాలి. దానివల్ల వైద్య పరిశోధనలకు సహకరించినవారం అవుతాము. అవయవ దానం చేయడం ద్వారా ఎనిమిదిమందికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వారమవుతాము. తొలిసారిగా 1954లో రోనాల్డ్ హెర్రిక్ అనే వ్యక్తి తన సోదరుడికి కిడ్నీ దానం చేసి చరిత్రలో నిలిచారు.
అవయవ దానంతో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినందుకు 1990లో డాక్టర్ జోసెఫ్‌ ఎడ్వర్డ్‌ ముర్రేకు నోబెల్ బహుమతి వచ్చింది.గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, చేతులు, ముఖం, కళ్లు, ఎముక మూలుగ, చర్మం, కణాలు.. ఇలా దాదాపు 200 అవయవాలు దానం చేయవచ్చు.అంధులకు నేత్రాలను అమర్చడం ద్వారా వారిని ఈ లోకాన్ని చూసే అవకాశం కల్పించవచ్చు.అవయవాలు అందుబాటులో లేక ఎందరో రోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఇంకా సామాజిక, మతపరమైన కట్టుబాట్ల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఫలితంగా అవయవాలను దానం చేసేందుకు చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. అవగాహనాలోపం, అపోహలు అవయవదానానికి ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. 

కామెంట్‌లు