అక్షరాస్త్రం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నిరక్షరతే మనదేశపు కళంకం
అక్షరాస్యతే దానికి దివ్యౌషధం
నిరక్షరతే మనవృధ్ధికి ఆటంకం
సాక్షరతే మన ఉన్నతి మూలం
మనంకూడా ప్రపంచ సంపూర్ణ సాక్షరతా
మహాయజ్ఞపు సమిధలవుదాం
మానవాళికి వెలుగునిచ్చే అక్షరకిరణాలవుదాం
అక్షరకిరణంతో నిరక్షరాస్యతా
తిమిరాన్ని పారద్రోలుదాం
అక్షరాయుధంతో నిరక్షరాస్యతా
రక్కసిని చీల్చి చెండాడుదాం
అక్షరాలు లక్షల మెదళ్ళను
కదిలిస్తూనే ఉంటాయి
అక్షరాలకు నిరీక్షణే ఉండదు
అవి వాడి వేడి అక్షరకిరణాలవుతాయి
అక్షరాలకు పరీక్షలే లేవు
అక్షరాస్త్రాలై అజ్ఞానాన్ని తరుముతాయి
తరతమ భేదాలు మరిచి
కలిసిమెలిసి మనమంతా
అక్షర కటి బధ్ధులమై
భరతమాత నుదుటను
దిద్దుదాం అక్షరతిలకం
భారతీయ జనజాగృతి
అది జరుగును తథ్యము!!
**************************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి కవిత చాలా బాగుంది. అభినందనలు. శుభాకాంక్షలు సార్ 🌹🙏🌹