సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -545
తుష్యతు దుర్జన న్యాయము
*****
తుష్యతు అనగా సంతుష్టుడగు.దుర్జనుడు అంటే దుష్టుడు, నైతికత లేని వాడు అని అర్థము.
తన పనుల చేత దుష్టుడు ప్రస్తుతము సంతోషంగా ఉన్నప్పటికీ,తన ప్రవర్తన వల్ల సంతుష్టుడైనప్పటికీ ఆ తర్వాత తగిన ఫలితం అనుభవించక తప్పదు అని అర్థము.
*దుర్జనుడు అనగానే ముందుగా మనకు సుమతీ శతక కర్త రాసిన పద్యం గుర్తుకు వస్తుంది.
"తలనుండు విషము ఫణికిని/ వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్/తల తోక యనక యుండును/ ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!"
అనగా పాముకు విషం కోరల్లోనూ,తేలుకు తోక చివర కొండిలోనూ మాత్రమే ఉంటుంది.కానీ దుర్మార్గుడి శరీరమంతా విషం వ్యాపించి ఉంటుంది.అందుచేత దుర్మార్గుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థము.
ఈ పద్యాన్ని బట్టే మనం దుర్జనుడు ఎలాంటి వాడో తెలిసిపోయింది.అలాంటి దుర్జనుడు గురించి రాసిన సుభాషిత శ్లోకమును కూడా చూద్దామా...
 "దుర్జనఃప్రియ వాదీతి నైతద్విశ్వాస కారణం!/మధు తిష్టతి జిహ్వాగ్రే హృదయేతు హాలాహలమ్!!"
అనగా ప్రియ సంభాషణలు చేసే వారందరూ మంచివారు కానవసరం లేదు. ప్రియ సంభాషణము చేసే వారిలో దుర్జనులూ వుంటారు.దుర్జనుని నాలుక చివరన తేనెలొలుకు తీయని మృదువైన సంభాషణలు ఎల్లప్పుడూ వుంటాయి.కానీ హృదయంలో భయంకరమైన విషము వంటి ఆలోచనలు వుంటాయి. అలాంటి వారు తమ చుట్టూ ఉన్న వారితో ఎంతో వినయ విధేయతలు నటిస్తూ,వారిని ఆకట్టుకునే విధంగా చక్కని తీయని సంభాషణలు చేస్తాడు.అవి వినడానికి ఎంతో నమ్మకంగా,మధురంగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటాయి.
ఆ విధంగా ఎదుటి వారిని నమ్మించి వంచన చేయడంలో  తరచూ విజయం సాధిస్తూ వుంటాడు.
నాలుక చివరి నుండి వచ్చిన తీయని తేనెలొలికే మాటలెప్పుడూ స్వలాభం కోసమే. ఇక లోపలి విషపు ఆలోచనలు ఎప్పుడూ ఇతరుల నాశనానికే ఉపయోగిస్తాడు.
మరి అలాంటి వారిని పసిగట్టలేని అమాయకులు త్వరగా వారి మాటలు నమ్మి మోసపోతూ వుంటారు.
 ముఖ్యంగా దుర్జనులలో మూడు రకాల వాళ్ళు ఉంటారు. వారిలో ఒకరు ఉన్మాదుల్లాంటి వారు. వారు హత్యలు, అత్యాచారాలు చేస్తూ  సమాజాన్ని భయకంపితులను చేస్తుంటారు. ఇలాంటి  వార్తలు సామాజిక మాధ్యమాల్లో వచ్చినప్పుడు  ఇలాంటి దుర్జనులను శిక్షించి నడి బజారులో ఉరితీయాలన్నంత ఆవేశం వస్తుంది.
ఇక రెండో రకం దుర్జనులు  ఆర్థిక సంబంధమైన ఎరలు  వేసి కొంచెం సొమ్ము కొద్ది కాలంలోనే పది రెట్లు అవుతుందని ప్రలోభ పెడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల వారిని దోచుకుంటుంటారు.
ఇక మూడో రకానికి చెందిన వారు నిలువెల్లా స్వార్ధపరులు.తమ కంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళని చూసి భరించలేక ఈర్ష్య అసూయతో రగిలిపోతూ వుంటారు.పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా వుండి , హత్యలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. స్నేహితుల్లా మసలుతూనే వెనుక గోతులు తీస్తుంటారు.
ఇలా మూడు రకాల దుర్జనులు కొందరు మన చుట్టూ ఉన్న సమాజంలో ఉంటారు. మరి వాళ్ళని కనిపెట్టడానికి,వారి బుద్ధిని పసిగట్టడానికి మనలో తగినంత విజ్ఞత, వివేకం, నిశిత పరిశీలనా శక్తి అవసరం.
అయితే అలాంటి దుర్జనులు  పొందే సుఖ సంతోషాలు తాత్కాలికమేనని గ్రహించాలి.ఎప్పటికైనా చేసిన దుర్మార్గాలకు శిక్ష అనుభవించాల్సిందే. దుర్మార్గపు పనులు చేస్తూ విర్రవీగిన దుర్యోధనాదులు,కీచక, బకాసురుడు వంటి వారు చివరికి ఎలాంటి మరణం పొందారో మనం వారి  గురించి చదివి తెలుసుకున్నాం.
అందుకే మన పెద్దవాళ్ళు అలాంటి దుర్మార్గులకు సంబంధించి ఓ సామెత తరచూ చెబుతుంటారు "తాతకు పెట్టిన చిప్ప దడిలోనే వుంది"అని.ఎవడు చేసే దుర్మార్గం వాడికే యమ పాశమై చుట్టుకుంటుంది" అని.
అలాంటి దుర్మార్గపు, పాపపు పనులు చేసిన కొంతమంది  మన కళ్ళముందే ఆ పాపాల ఫలితాలు అనుభవించడం చూస్తుంటాం.కొంతమందికి మాత్రం గత జన్మ పుణ్య ఫలం వల్ల వర్తమానంలో  వారి పాపపు పనుల ఫలితం అంటదు. అలాంటి వారిని ఉద్దేశించి చాలా మంది తిట్టుకుంటూ "చచ్చిన తర్వాత అలాంటి వారు భయంకరమైన నరకానికి వెళతారు " అనడం మనం వింటుంటాం.
 దుర్మార్గులు కొందరికి పైకి శిక్షలు పడక పోయినా వాళ్ళ అంతరాత్మల ముందు ఎల్లప్పుడూ దోషులుగా నిలవాల్సిందే. వాళ్ళు చేసే తప్పు కొంగున కట్టుకున్న నిప్పే.వాళ్ళను ఏనాటికైనా నిలువునా దహించి వేయకుండా ఉండదు.మనిషికీ మనసే శిక్ష వేస్తుంది.అది మాత్రం సత్యం.
ఇది గ్రహించిన వారెవరూ ఎలాంటి తప్పులు , దుర్మార్గపు పనులు చేయరు. అలా చేయకుండా ఉండేందుకే మన పెద్దలు ఈ "తుష్యతు దుర్జన న్యాయము" ద్వారా హెచ్చరిస్తున్నారు.

కామెంట్‌లు