అమాయక మాంత్రికుడు- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 మా మనవడికి
రోజులవయసే, కానీ
ఒకసారి
తపసు చేసుకుంటున్న మౌనమునిలా
కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉంటాడు
మరోసారి
లోకంలోని బాధనంతా తానే అనుభవిస్తున్నట్లు
వాడి మొహంలో బాధామయ వీచికలు
ఇంకోసారి
ప్రపంచంలోని ఆనందమంతా
తనదే అన్నట్లు ఆనందప్రదర్శన
ఆతర్వాత
విశ్వపుబరువు తన భుజస్కంధాలపైనే
మోస్తున్నట్లు హెర్క్యులస్ లా ఫోజిస్తాడు
మరోసారి
నవ్వులు రువ్వుతూ
మనను మరోలోకంలోకి తీసుకెళతాడు
మధ్యలో
ఎవరో ఏదో చేసినట్లు
కెవ్వున కేకలువేసి ఏడుపు లంకించుకుంటాడు
వాడి బాధా ఏడుపూ చూసి
మా మనసు గిలగిలలాడి పోతోంది
సంతోషాంతరంగితమైన వాడి నవ్వుతో
మా ఇంటిల్లపాది పెదాలపై నవ్వులపూలు పూస్తాయి
వాడు నిద్దరోయాడంటే
ఇల్లంతా నిశ్శబ్దపు గుసగుసలే
వాడు మేలుకున్నాడంటే
మా అందరి చూపులదారులన్నీ వాడివైపే
వాడు మా కుటుంబంలోకి
ఆనందాల హరివిల్లును మోసుకువచ్చాడు
తరగని ఆనందజలధిని వెంటతెచ్చాడు
మొత్తానికి వాడు
మా మనసులను, కాలాన్ని కరిగింపజేసి
మమ్మల్ని తనవైపుకు మరలింపజేసుకున్న
అమాయక మాంత్రికుడు !!!
**************************************
.

కామెంట్‌లు