'శంభో!'శతకపద్యములు - టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 (కందములు ).
===========
51.
ఉమ తోడుగ నీ జగతిని
గమనించుచు భద్ర గతిని గాచెడి భర్గా!
సుమములచే నిన్ను గొలుతు
మమకారము జూప రమ్ము !మరువక శంభో!//
52.
కైలాసంబున వెలయుచు
గాలాకృతిగా జగతిని గాచెడి భద్రా!
యేలిక వీవని నమ్మితి
మూల పరాత్పర!ముదముగ మ్రొక్కెద శంభో!//
53.
 మురిపెముగా నీ సేవలు
మరిమరి జేసెద భవహర!మక్కువ తోడన్
మరుజన్మల నీయకుమా!
శరణము గోరుచు భజింతు శశిధర శంభో!//
54.
 శివతత్త్వము నెఱిగితి నే
భువనము లేలు జగదీశ!ముదముగ నీవే
నివసింపుమ నా మదిలో!
భవహర!నిరతము గొలిచెద భక్తిగ శంభో!//

55.
 పెన్నిధి వీవని నమ్మితి
దిన్నని గాచిన దొరవని దెలియఁగ భర్గా!
సన్నిధి పఱుగున జేరితి
జెన్నుగ నా మాట వినుమ!శివ శివ!శంభో!//

కామెంట్‌లు