సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు-531
తప్త మాక్షికోద్ధరణ న్యాయము
******
తప్త అనగా కాచబడినది,కరిగించబడనది,బాధించబడినది,ఆచరించబడినది.మాక్షికం అనగా తైల/నువ్వుల నూనె వర్ణములో ఉన్న తేనె. ఉద్ధరణ అనగా పెకిలించుట,వస్త్రాదులు విడుచుట,లాగుట, తుడిచి పెట్టుట, ఋణము నుండి విముక్తుడగుట.
 కాగిన నువ్వుల నూనె లాంటి తేనెలో పడిపోయిన ఈగను నేర్పుగా వేలితో తీసివేయ వచ్చును.
అనగా అభ్యాసము వలన మంచి ఫలితములు పొందుతారు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 అభ్యాసం అంటే ఒక విధంగా నిరంతర సాధన అని అర్థము.దేనిపై అయితే దృష్టి పెడతామో దానిని సాధించేందుకు ఆటంకాలను అధిగమించి కృషి చేస్తారో వారికి ఆ పని అత్యంత సులువుగా చేయగల సామర్థ్యం సొంతమవుతుంది.దీనినే మన పెద్దలు "అభ్యాసం కూసువిద్య" అని అంటుంటారు.
 మరి ఏదైనా అభ్యాసము చేయాలంటే ఆ యా వ్యక్తులకు శ్రద్ధ,ఆసక్తి రెండూ మెండుగా వుండాలి. ఏ విద్య నేర్చుకోవాలన్నా, అందులో నైపుణ్యం రావాలన్నా తప్పకుండా సాధన అవసరం. అందుకే ఓ పాటల రచయిత "సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిది ఏముంది? " అంటారు.
దేనినైనా ఇష్టంగా నేర్చుకోవాలి.అప్పుడే కష్టం అనిపించదు.కష్టంగా భావిస్తే అందులో ఎప్పుడూ నిపుణత ఎప్పుడూ సాధించలేము.ఎన్నిసార్లు చేసినా కొత్తగానే ఉంటుంది.అందుకే సాధనలో త్రికరణ శుద్ధి కావాలని మన పెద్దలు అంటుంటారు.
 ఎవరైనా ఒక వ్యక్తి తన విద్వత్తులో కానీ, తనకు నచ్చిన వివిధ కళలలో కానీ అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి కారణము వారు పట్టుదలతో చేసిన నిరంతర కృషి మరియు సాధనే.
" సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనకుంటే పొరపాటోయీ " అంటారు మహా కవి శ్రీ శ్రీ గారు.కాబట్టి సాధనకు ఇక చాలు అనే విరామము వుండదు.పుల్ స్టాప్ పెట్ట కూడదు. సాధనకు దూరం కాకూడదనేది అనుక్షణం గమనంలో ఉంచుకోవాలి.
అలా చేసిన సాధనతో వచ్చిన ప్రావీణ్యం వల్ల తేనెలో పడిన ఈగనే కాదు చీమను కూడా అలవోకగా తీయగలము.ఇదంతా అభ్యాసం వల్ల పొందిన ఫలితమే.
ఇలాంటి ఎన్నో విషయాలను మనం "తప్త మాక్షికోద్ధరణ న్యాయము" ద్వారా తెలుసుకోగలిగాం.మరి మనము కూడా మనకు నచ్చిన,నలుగురు మెచ్చిన కళను వజ్రంలా సానబెట్టుకొందాం.నిరంతర అభ్యాసంతో అందులో పట్టు సాధించి అవలీలగా చేయగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకుని మంచి ఫలితాలను పొందుదాం.

కామెంట్‌లు