'శంభో!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 (కందములు )
41.
మందార మల్లెల జాజుల
కెందామర మాల లల్లి కేదారేశా!
ముందఱ బెట్టితి నీకై
పొందిక గా పూజ సలుప ముదముగ శంభో!//
42.
నిన్నే దలచెద భర్గా!
కన్నార్పక నీదు రూపు కనియెద నయ్యా!
దన్నుగ నిలువర తండ్రీ!
నిన్నెడబాయనెపుడు హర!నిజమిదె శంభో!//

43.
 గురుతుగ నీ చరితమునే
మరిమరి భక్తిగ దలచెద మానస మందున్
దరిసెన మీయవె శంకర
పరివారము తోడ నేడు వరముగ శంభో!//
44.
 అనయము నీ పద సేవలు
వినయముగా సల్పి గొల్తు విభవము తోడన్
గనికరమును జూపు శివా!
మనియెద నీ దాసిగ నను మరువకు శంభో!//
45.
యోగీశ్వర!నీ చెంతకు
సాగిలి బడి వచ్చి మ్రొక్కి సదమల హృదితో
నీ గుణ గానము జేసెద
వాగీశ వినుత!విను మిదె ప్రణతిని శంభో!//

కామెంట్‌లు