ప్రశాంత జీవనానికి కర్మయోగం;- సి.హెచ్.ప్రతాప్
 జీవ తత్వాన్ని తెలుసుకోవటానికి అవసరమైన మొత్తం జ్ఞానం భగవద్గీతలో వుంది.  కులమతాలతో.. దేశప్రాంతాలతో.. సంబంధం లేకుండా అందరూ అనుసరించదగిన గ్రంథం భగవద్గీత కాబట్టే నేటికి కోట్లాది మంది ప్రపంచ వ్యాఒతంగా భగవద్గీతను నిర్విరామంగా చదువుతున్నారు.. ఎటువంటి సంకటాలు లేని ప్రశాంత జీవితాన్ని గడపటానికి అనుసరించదగిన సాంఖ్య యోగము, కర్మ యోగము, భక్తి యోగము అనే మూడు మార్గాలు దీనిలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కర్మ యోగం. కర్మ యోగ మార్గంలో ప్రతి కర్మకు కర్త ఉంటాడు. కర్మ చేయటం వల్ల కలిగే కర్తఫలము కూడా ఉంటుంది. కర్తకు కర్మ చేసే హక్కు ఉంటుంది. కానీ కర్మఫలంపై అతనికి ఎటువంటి నియంత్రణ ఉండదు. దీనినే శ్రీకృష్ణుడు- ‘‘అన్ని కర్మలు- సత్వ, తమో, రజోగుణాల వల్ల జరుగుతాయి. ఈ గుణాలు ప్రకృతి వల్ల ప్రేరేపితం అవుతాయి. అందువల్ల జాగ్రత్తగా తరచి చూస్తే మనం కర్తలు కూడా కాదని అర్ధమవుతుంది’’ అని చెబుతాడు. కర్మలు చేయటం వెనక కూడా ఒక పరమార్థముందని.. కర్మలను చేయకపోతే ఈ భౌతిక దేహం యొక్క అస్థిత్వతే ఉండదని చెబుతాడు.బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా, లోనుండి మమకార రాహిత్యంతో ఉండే, కర్మ యోగము ఆచరించే వారు, ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీ కృష్ణుడు చెప్పాడు.మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని 'యజ్ఞం' అవుతుంది. యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది, దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు; వారు తమ ఇంద్రియ లౌల్యం కోసమే జీవించేవారు మరియు వారి జీవితాలు వ్యర్థమైనవి.హృదయపూర్వక సేవ అస్సలు సేవ కాదు. మీరు సేవ చేసేటప్పుడు మీ పూర్ణ హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను ఇవ్వండి. మీరు కర్మ యోగ సాధన చేసినప్పుడు ఇది చాలా ముఖ్యం.
కొంతమంది తమ శరీరం ఒక చోట, మనస్సు మరొక చోట, ఆత్మ మరొక చోట ఉంటాయి. వారు మార్గంలో గణనీయమైన పురోగతిని గుర్తించకపోవడానికి కారణం అదేనని స్వామి శివానంద చెబుతారు. 

కామెంట్‌లు