సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

న్యాయాలు -526
జాతేష్ణి  న్యాయము
  ******
జాత అంటే పుట్టుక. ఇష్టి అనగా వ్యక్తి యొక్క మానసిక లేదా శారీరక చర్య - అదే కర్మగా చెప్పబడుతుంది.
"జాతపుత్రుడు ఇష్టి చేయవలెను అన్నట్లు".అనగా పుత్రులున్న తండ్రి క్షేమంగా ఉండాలని కోరుకుని చేసే యాగమే జాతేష్టి.
 పుత్రులు కలవాడు ఇష్టి చేయవలెను అన్నప్పుడు  ఆ చేయబడింది కుమారుని క్షేమం కొరకా లేక తండ్రి క్షేమం కొరకా అని సందేహము కలుగుతుంది ఎవరికైనా  అయితే పుత్ర సమేతుడైన తండ్రి యొక్క క్షేమం కొరకే అని సమాధానం ఇందులో వస్తుంది.
 ఇక్కడ ఇష్టి అనగా ఏమిటో తెలుసుకుందాం. ఇష్టి అంటే చేయాల్సిన, ఆచరించాల్సిన కామ్య కర్మ.ఈ కర్మ నాలుగు రకాలుగా ఉంటుంది.
అందులో 1. కామ్యములు( ఫలితాలను ఆశించి కోరికతో చేసేవి)-ఒకటి పుత్రకామేష్టి. రెండవది చిత్రాయాగం. ఇక మూడోది ఆపైన చేసే జ్యోతిష్టోమాదులు.
ఇక 2.నిత్య కర్మలు( ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆచరించవలసిన విధులు)- ఒకటోది సంధ్యావందనం అనగా పగలు రాత్రి కలిసి వున్న సంధి కాలంలో  చేసే వందనం. రెండవది అగ్ని హోత్రాదులు అనగా అగ్ని దేవుని ఆవాహన చేసి ఆయనని సంతృప్తి పరచడానికి చేసే ఏర్పాట్లు.
3.నిషిద్ధ కర్మలుచేయకూడని కర్మలు/ పనులు)- సురాపానం,పరదారగమన,పరార్థాభిలాషాదులు.
4నైమిత్తికములు-( నిమిత్తము/ కారణము వలన కలిగేవి) జాతేష్టి,గృహదాహేష్టి,విశ్వజిత్యాగాదిశ్రౌతములు, గ్రహణస్నానాది స్మార్త కర్మలు.
స్మార్త కర్మలు అనగా అర్థం ఏమిటో చూద్దాం. సంస్కృతంలో స్మార్త కర్మలు అనగా హిందూ స్మృతులపై ఆధారపడినవి లేదా స్మృతులలో పొందుపరచబడిన వాటికి సంబంధించిన సాంప్రదాయ లేదా వాడుకకు సంబంధించినవి అని అర్థము.స్మృ అంటే గుర్తుకు తెచ్చుకునుట అనే మూల సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది.స్మృతి యొక్క వృద్ధి కారకం స్మార్త. ఇలా వేదాలను, పురాణాలను, ధర్మ శాస్త్రాలను గుర్తుకు తెచ్చుకుంటూ వాటిని అనుసరించే వారిని స్మార్తులు అని, వారు చేసే కర్మలను స్మార్త కర్మలు అని అంటారు.
జననం మరణం, గ్రహణం ఇత్యాది కారణాల వలన సంభవించే వాటికి  స్మార్త కర్మలు చేస్తుంటారు.
ఇక పుత్రకామేష్టి ఒకటి యాగం గురించి మనందరికీ తెలిసిందే. కొడుకులు పుట్టడానికి చేసే యాగం.ఈ యాగం గురించి రామాయణంలో చదువుకున్నాం.వసిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడం.తద్వారా రామలక్ష్మణ,భరత శత్రుఘ్నులను పొందడం.
నైమిత్తము వలన కలిగేవి జాతేష్టి, గృహదాహేష్టి,శ్రౌతము మొదలైనవి.*శ్రౌతము అంటే శ్రుతిని ( వేదాన్ని) అనుసరించి చేసే కర్మలు.
జాతేష్టి అనగా వివాహం ద్వారా జన్మించిన సంతానం. ఆ సంతానం బాగుండాలి.ఆ సంతానానికి మంచి జరగాలి,మంచి భవిష్యత్తు ఇవ్వగలగాలి అంటే ఎవరు బాగుండాలి? హిందూ మత సంప్రదాయం ప్రకారం తండ్రినే ముఖ్యుడు.కాబట్టిపుత్ర సమేతుడైన తండ్రి యొక్క క్షేమం కొరకు చేసే యజ్ఞాన్ని "జాతేష్టి" అంటారు.
అన్ని యాగ నియమాల వలెనే   జాతేష్టి యాగం కూడా ఉంటుంది.
ఇలా మానవులు ఏవి చేసినా  తమ క్షేమం, కుటుంబ క్షేమం,రాజైతే తన రాజ్యం ,తన పాలన సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలనే కామనలతో చేసేవే.
 మరి మనం కూడా మనమూ మన చుట్టూ ఉన్న సమాజం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మనుష్యేష్టి,మానవీయేష్టి చేద్దాం.జాతేష్టిలా మనుష్యేష్టి ఆకలి గొన్న వారికి, అవసరాలు ఉన్న వారికి తగువిధంగా సహాయం చేయడం. మానవీయ విలువలతో జీవితాన్ని కొనసాగించడం.మరి మీరేమంటారు?


కామెంట్‌లు