స్థంభాద్రి లక్ష్మీనరసింహుడు...;- ప్రమోద్ ఆవంచ - 7013272452

 మెడికేర్,మాక్సికేర్, ఆరోగ్య,మెడ్విన్, క్యూర్ కేర్,రక్ష,అనే పేర్లతో అనేక హాస్పిటల్స్ ని మనం ప్రతి ఊళ్ళో చూస్తూనే ఉంటాం.ఖమ్మంలో ఒక హాస్పిటల్ పేరు కొంచెం కొత్తగా అనిపించింది.ఆ హాస్పిటల్ పేరు 'స్థంభాద్రి'సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.ఆ హాస్పిటల్ ప్రమోటర్ డాక్టర్ గుమ్మడి రాఘవేంద్ర.ఆయన యూరాలజిస్ట్.గత ఆదివారం చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది.అయిదు అంతస్తులతో అత్యంత అధునాతన పరికరాలతో, విశాలమైన రూములు, ఐసీయూ,లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లతో, హాస్పిటల్ లుక్ చాలా బాగుంది.ప్రస్తుతం న్యూరో, కార్డియాక్,యూరో,విభాగాలు పేషెంట్లకు అందుబాటులో ఉన్నాయి.నాకు ముఖ్యంగా స్థంభాద్రి అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోవాని అనిపించింది. డాక్టర్ రాఘవేంద్ర గారిని కలిసాను.చాలా బిజీ యూరాలజిస్ట్,అయినా నా కార్డు చూసి వెంటనే లోపలికి పిలిచారు.కంగ్రాట్స్ చెప్పాక,నా మనసును తొలుస్తున్న  ప్రశ్నను అడిగాను.స్థంభాద్రి అనేది....ప్రాచీన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం.అదే ఒకప్పటి ఖమ్మం పేరు.స్థంబాద్రి కాస్తా వాడుకలో ఖంబాద్రి అయ్యింది,అది కాలక్రమేణా ఖంబం మెట్టుగా రూపాంతరం చెంది చివరికి ఖమ్మంగా మారిపోయిందని రాఘవేంద్ర గారు టూకీగా చెప్పారు.ఆ బిజీలో కూడా నాకంత సమయం కేటాయించి మాట్లాడినందుకు ఆనందమేసింది.హాస్పిటల్ మొత్తం తిరిగి చూడమని చెప్పారు.మొత్తం చూసాను.హాస్పిటల్ నిర్మాణం చాలా అద్బుతంగా ఉంది.హాస్పిటల్ ఎలివేషన్, వెంటిలేషన్, చాలా బాగుంది.పేషెంట్ అటెండెర్స్ స్టేయింగ్ రూములు,కూడా ఉన్నాయి....కట్ చేస్తే....
                నాకు స్థంబాద్రి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది.
ఆ దేవాలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనీ అనుకున్నాను.మిత్రుడు కాంచనపల్లి రమేష్ బాబు కి ఫోన్ చేసి,ఖమ్మంలో మిత్రులెవరైనా ఉన్నారా అని అడిగాను, దానికి తను క్షణం ఆలస్యం చేయకుండా 
సీనియర్ జర్నలిస్టు ప్రసేన్ గారు ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేస్తే మొత్తం చరిత్ర చెపుతారనీ చెప్పాడు.ప్రసేన్ గారితో ఫోన్ ద్వారా మాట్లాడడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యాను.ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ రాత్రి ఫోన్ చేసి, నన్ను నేను పరిచయం చేసుకుని విషయం చెప్పాను.స్థంభాద్రి చరిత్ర గురించి ఆయన కూడా డాక్టర్ రాఘవేంద్ర గారు చెప్పినదే చెప్పారు...సరే రేపు శనివారం ఉదయం నేనే స్వయంగా ఆ గుడికి వెళ్ళి ఇంకేమైనా కొత్త విషయాలు తెలుసుకుందామనీ అనుకున్నాను.కట్ చేస్తే.....
                  శనివారం ఉదయం ఏడు గంటల సమయం 
నేను ఆటోలో పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు దారి గుండా బయలు దేరాను.ఆ రోడ్డు మొదట్లో ఒకవైపు పోలీసు స్టేషన్, మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఉన్నాయి.అలా కొంచెం దూరం వెళ్ళాక కుడి వైపుకి తిరిగి 
మళ్ళీ ఎడమ వైపుకు తిరిగితే భవానీ నగర్ వస్తుంది.ఆ
రోడ్డుపై కొద్ది దూరంలో ఎడమవైపున ఖమ్మంలో ప్రముఖ 
న్యూరో సర్జన్ డాక్టర్ అసాధారన్ హాస్పిటల్ ఉంటుంది.
ఆ రోడ్డుపై నుంచి అలాగే కొత్త బస్టాండ్ వెళ్ళే దారిలో 
కుడివైపున స్థంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వాహనాలు వెళ్ళే దారి ఉంటుంది.ఇది వెనుక వైపు,గుడి ముందు మెట్ల దారి ఉంది.వాహనాలు 
వెళ్ళే దారిలో నేను ఆటో దిగాను.దారిలో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు, కమ్యూనిస్టు పార్టీకీ అనుబంధ టీచర్ల 
సంఘం కార్యాలయం....అన్నీ దారికి రెండువైపులా 
కనిపించాయి.ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టులకు కంచుకోట....ఆటో దిగాను, ఎదురుగా 
పెద్ద ఆర్చి,దాని లోపల ఎడమవైపున ఒక పొడవాటి బోర్డుపై స్థంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం - ఖమ్మం అని రాసి ఉంది.ఆ రోడ్డుపై నుంచి అలాగే నడుచుకుంటూ గుడి గుట్ట ఎక్కాను.అక్కడ చెప్పుల స్టాండ్ ముందు ఒక ముసలావిడ కూర్చుంది.వయసు ఏడు పదులు ఉంటుంది.ఆమె ముఖంపై వాత్సల్యంతో కూడిన నవ్వు.గుడికొచ్చే భక్తులను ఆప్యాయంగా పలకరించడం నేను గమనించాను.అది నాకు బాగా నచ్చింది.నేను షూస్ విప్పి స్టాండ్ లో పెట్టి దర్శనం చేసుకొని వస్తాను, కొంచెం చూస్తూ ఉండమ్మా అన్నాను,సరే కొడుకా నువ్వు పోయిరా అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది.ఆ నవ్వుతోనే గుట్ట ఎక్కిన ఆయాసం అంతా తగ్గిపోయింది.అటు నుంచి కాళ్ళు, చేతులు కడుక్కుని, కొబ్బరికాయ,తులసీ మాలను తీసుకుని గుళ్ళోకి ప్రవేశించాను.ముందు హనుమంతుడి దర్శనం చేసుకొని, లక్ష్మీ నరసింహ స్వామి గర్భ గుడిలోకి వెళ్ళాను.నిజంగా అద్బుతం... కొండ రాయిని చీల్చుకుని వెలిసిన స్వయంభు ఉగ్ర నరసింహ స్వామిని చూస్తే భక్తి భావంతో చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేం.అక్కడ ఏదో తెలియని శక్తి ఒక వెలుగై ఆ పరిసరాలను తేజోవంతం చేస్తున్నట్లు అనిపిస్తుంది.అక్కడి నుంచి కదలాలనిపించదు.చల్లని గాలి ముఖానికి తగిలిన అనుభూతి.చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించే పరిస్థితి కాలం స్తంభించి స్థంభాద్రి నారసింహుడి పారవశ్యంలో మునిగిపోయే మానసిక స్థితి.నాగరిక ఒత్తిడి జీవితాలకు గొప్ప ఉపశమనం. మానసిక ప్రశాంతత ఇచ్చే అహ్లాదకరమైన పవిత్ర స్థలం. పక్కనే లక్ష్మీ అమ్మ వారి ఆలయం.దాని ఎదురుగా పెద్ద గిన్నెలో పానకం, భక్తులు 
తాగడానికి వీలుగా అక్కడ గ్లాసులు కూడా ఏర్పాటు చేశారు.బయటకు వచ్చి కోనేరు వైపుకు వెళితే ముందుగా 
రెండు పెద్ద రాళ్ళ మధ్య పాముల పుట్ట, ఉంటుంది.ప్రతి నాగుల చవితికి భక్తులు వందల సంఖ్యలో వచ్చి పాలతో పూజలు నిర్వహిస్తారు.పక్కనే శ్రీ విష్ణు మూర్తి ఆలయం.
ఎదురుగా పాదాకృతిలో ఉన్న కోనేరు మనకు కనిపిస్తుంది...ఇదీ స్థంభాద్రి కొండపై మనకు కనిపించే పవిత్ర స్థలాలు.అన్నింటినీ దర్శనం చేసుకుని వచ్చి గర్భ గుడిలో కొంచెం సేపు కూర్చున్నాను.అక్కడ పది తరాల నుంచి  ఒకే కుటుంబం అర్చకత్వం చేస్తుంది.ఆ కుటుంబానికి వారసులు శ్రీనివాసాచార్యులు...ఆయనతో 
సంభాషించి స్థంభాద్రి దేవాలయం చరిత్ర తెలుసుకున్నాను... చరిత్రలోకి వెళితే...
                రాక్షస సంహారానికై స్థంభం నుంచి ఉద్భవించి
ప్రహ్లాదుడిని కాపాడాడు ఉగ్ర నరసింహ స్వామి.
హిరణ్యకష్యకపుడి సంహారం అనంతరం తన అవతారాన్ని చాలించి భక్తుల కోసం ఆ స్థంభాద్రి మీద 
కొలువైయ్యాడు.ఆ తరువాత కొన్ని రోజులకు ఒక మహార్షి 
తన శిష్యులతో వచ్చి ఈ గుట్ట పైనే తపస్సు చేసారు.
ఆయన సమూహంలో ఒక ముని నరసింహ స్వామి కోసం గోర తపస్సు చేసినట్లు,అందుకు లక్ష్మీ నరసింహ స్వామి 
ప్రసన్నుడై ప్రత్యక్షమయినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఆ తరువాత రోజుల్లో ఈ స్థలం లక్షీ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.అక్కడ మునులు స్నానాలు చేయడం వల్ల ఆ ఏరుకు మున్నేరు అనే పేరు 
వచ్చిందనీ,ఈ మున్నేరు కృష్ణ నదికి ఉపనది అని కూడా 
చరిత్ర చెబుతుంది.మునులు తమ నీటి అవసరాల కోసం
కోనేరు కావాలనీ అడిగితే స్వామి తన పాదతాడనంతో
గుట్ట పైనే కోనేరును ఏర్పాటు చేసారని, పురాణాల్లో చెప్పబడింది.ఇప్పటికీ ఆ గుట్ట పైన పాదాకృతిలో ఉన్న 
కోనేటిని మనం చూడవచ్చు.ఇదీ పూర్వ చరిత్ర.16 వ శతాబ్దంలో కాకతీయ రాజులు కొండ మీద స్వామి వారిని దర్శించుకొని రాతి ధ్వజస్తంభాన్ని, ముఖమండప నిర్మాణానికి ప్రతిష్ట చేయగా.అటు తరువాత సామంతరాజులు ఆలయ నిర్మాణం చేసారనడానకి 
ఆధారాలు ఉన్నాయి...
                     స్థంభాద్రి దేవాలయం బయటకు వచ్చాను.
చెప్పుల స్టాండ్ దగ్గర అమ్మ నవ్వుతూ వీడ్కోలు చెప్పింది.....
                                
కామెంట్‌లు