మానసిక పరిపక్వత;- - యామిజాల జగదీశ్
 మహావీరుడు ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి సెయింట్ హెలీనా అనే దీవిలో యుద్ధఖైదీగా ఉన్న కాలమది.
ఆయన ఆరోగ్యాన్ని గమనించడానికి ఓ డాక్టర్ని నియమించారు. ఓరోజు నెపోలియన్, డాక్టరూ కలిసి ఓ బహిరంగ ప్రదేశంలో నడుచుకుంటూ పోతున్నారు. కాస్సేపటికి వారిద్దరూ ఓ ఇరుకు మార్గంలో అడుగులు వేశారు.
అప్పుడు ఎదురుగా ఓ మామూలు స్త్రీ  నడుచుకుంటూ వస్తోంది. పక్కకు తప్పుకుని నెపోలియన్ తనకు దారి ఇస్తారని అనుకుంది ఆ స్త్రీ.
అంతట డాక్టర్ ఆమెతో “ఇదిగో ఆయన ఎవరనుకున్నావు.... ఆయన నెపోలియన్ చక్రవర్తి. పక్కకు తప్పుకో. ఆయన ముందుకు పోవడానికి నువ్వే పక్కకు తప్పుకోవాలి.... “ అని అన్నారు.
వెంటనే నెపోలియన్  “ఇప్పుడు మీతో ఉన్న నెపోలియన్ చక్రవర్తి కాదు. ఓ మూలు నెపోలియన్. ఇతరులు పక్కకు తప్పుకుని నాకు దారివ్వాల్సిన పరిస్థితి కాదిప్పుడు. ఓ మామూలు స్త్రీకైనా తానే పక్కకు తప్పుకుని దారివ్వక తప్పదు. అలా దారివ్వడం వల్ల తానేమీ బాధ పడబో “ నని చెప్పారు.
నెపోలియన్ తన జీవితంలో హెచ్చుతగ్గులను ఒకేలా చూసి పరిస్థితికి తగినట్లే వ్యవహరించిన వ్యక్తి. ఎప్పుడూ గెలుపు తన పక్షమే అని అనుకోను. ఓటమిని చవిచూడడం నాకు తెలుసు. గెలుపోటములను ఒకేలా చూసిన వ్యక్తిని నేను. ఈ మానసిక పరిపక్వత కలవారిని స్థితప్రజ్ఞుడిగా భగవద్గీత చెప్పనే చెప్పింది. విజయం సాధించినప్పుడు విర్రవీగలేదు. పరాభవం పొందినప్పుడు డీలా పడలేదు. రెండిటినీ సమానంగా చూశారు. స్వీకరించారు. ఈ మానసిక పరిపక్వత వల్ల జీవితంలో దేన్నయినా అధిగమించవచ్చు. అది మనిషిని దెబ్బతీయదు. పైపెచ్చు ఎప్పుడూ నిలకడగా ఉంచుతుంది.

కామెంట్‌లు