సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా
 న్యాయాలు-549
దగ్ధ పత్ర న్యాయము
   ******
దగ్ధ అనగా సంపూర్ణంగా కాలి బూడిద అగుట.పత్ర అనగా ఆకు లేదా దళము అని అర్థము.
ఆకును కాల్చినప్పుడు అది మసి అవుతుంది కానీ తన ఆకారమును మాత్రం విడువదు.పరీక్షగా చూసినట్లయితే ఈనెలు, మధ్యలోని పొడవైన తీగ లాంటి ఈనెతో సహా మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ( పొరపాటున కాలిపోయిన రూపాయి నోటులో కూడా దాని ఆకారము, అక్షరాలు, అంకెలు  అన్నీ కూడా స్పష్టంగా ఉన్నట్లు కనబడుతూ ఉంటాయి.కానీ మసిగా  మారిన ఆకు లేదా రూపాయి తిరిగి యథాస్థితికి రాలేవు.అవి యథార్థాలు కాలేవు అనే అర్థంతో ఈ "దగ్ధ పత్ర న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
కాలిన ఆకు కళ్ళకు  ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ గత సజీవ స్థితిని కోల్పోయిన ఆకు ఉనికి ఇక వుండదు.అయితే దాని గత రూపం కళ్ళలో   మెదులుతూ వుంటే  మనో నేత్రం దానిని స్పష్టంగా చూడగలదు.గత, వర్తమానంలో జరిగిన క్రియ గురించి  ఆలోచించగలదు.ఇలాంటివి శాస్త్రీయమైన ప్రయోగాల ద్వారా  ఋజువు చేయబడతాయి.ఈ విషయాలను  దృవీకరిస్తాయి. అయితే ఇలాంటి వాటిని ప్రయోగ శాలలో చూస్తూ ముందు,ఆ తర్వాత వచ్చే మార్పులు గమనిస్తూ వుంటే మనమెంతో ఆశ్చర్యానికి లోనవుతుంటాం.
ఇక ఈ న్యాయాన్ని  ఆధ్యాత్మిక వాదుల దృష్టితో చూసినప్పుడు జ్ఞాన నేత్రం తెరుచుకున్న వ్యక్తికి ఈ విశాల ప్రపంచంలో అన్నీ గతం , వర్తమానం రెండూ కనిపిస్తాయి.కానీ వాటితో ఎలాంటి సంబంధం ఉండదు.వాటి గురించిన ఆలోచనల్లో   స్పష్టత వచ్చిన వారు అన్నింటికీ అతీతంగా వుంటారని వారి అభిప్రాయము.
మరి  జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకునే వారికి సృష్టిలో ప్రతి విషయాన్ని తెలుసుకోవడంలో ఆసక్తి వుంటుంది. సత్యాసత్యాల  నిరూపణకు మూలాలు తెలుసుకోవాలనే తపన ఉంటుంది. అలాగ వారి  ఆసక్తి,తపన రెండూ దృగ్గోచరమైన ప్రతిదీ నిమిత్త మాత్రమే అన్న అవగాహన వచ్చేలా చేయడమే కాకుండా వారిలోని జ్ఞాన నేత్రం  తెరుచుకునేలా చేస్తాయి. సత్యాన్వేషణ అనేది ఇక వారిలో తీవ్ర తరం అవుతుంది.
అలాంటి అన్వేషణే తాత్విక చింతనకు దారి తీస్తుంది. మనిషి జననం మరణ చక్రంలో వ్యక్తి చేతనత్వం నుండి అచేతనత్వానికి వెళ్ళడమే మరణమనీ ఇక "దగ్ధ పత్ర న్యాయము" లాగే పూర్వ స్థితిని పొందడం వుండదనేది తెలిసిపోతుంది."జాతస్య మరణం ధృవం"అనే సత్యం గోచరిస్తుంది.రాలిన లేదా కాలిన ఆకులో కోల్పోయిన జీవం మళ్ళీ రాదనేది తెలిసిపోతుంది.
ఈ విధంగా కళ్ళ ముందు  కనిపించే వర్తమానపు యథార్థాలు అవగతమవుతూ వుంటాయి.గతాలు వర్తమానాలు కాలేవనీ, మళ్ళీ గత స్థితికి చేరుకోలేవని, మనిషి జీవితం కూడా అదే విధముగా ఉంటుందనేదే ఈ "దగ్ధ పత్ర న్యాయము" లోని అంతరార్థం.
 ఇది గ్రహించి మనం ఈ లోకం నుంచి కనుమరుగు కాక ముందే యథాస్థితిని కోల్పోక ముందే చేయాల్సిన మంచి పనులు చేద్దాం.

కామెంట్‌లు