'శంభో!'శతకపద్యములు ;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 కందములు 
==========
101.
శక్తినొసంగెడి దేవర!
భక్తుల నెడబాయని శివ! పడిపడి నే సం 
రక్తిగ సేవలు సల్పు ద 
వ్యక్త నిరాకుల కపర్థి!భయహర శంభో!//
102.
తీరుగ నిన్నే కొలిచెద
వారిజ భవసన్నుత నిను వదలను తండ్రీ!
కోరను వరముల నెన్నడు
కోరితి నీ పదములకడ కొలువును శంభో!//

103.
దారిని జూపెడి గురునిగ
గారపు శిష్యుని వలె గని గమనిక తోడన్
దోరపు బుద్ధినొసంగుమ!
చేరి భజించెద నిన్ను శివశివ శంభో!//
104.
కరములు మోడ్చుచు వేడెద
స్థిరమగుమతి నొసగుమయ్య!సిద్ధేశ భవా!
నరకములో పడద్రోయని
పరమపదంబును గనుగొను వరమిడు శంభో!//
105.
చల్లగ గాచెడి నిన్నే 
తల్లీ దండ్రిగ దలంచి తరియింతునయా!
కల్లలు చెప్పను శంకర!
ముల్లోకాధిపతి నీకు మ్రొక్కెద శంభో!//
106.
విడువను నీ పాదంబులు
పడియుందును నీదుచెంత పరిపరి విధముల్
నుడివెద నీ చరితంబులు
గడిపెద నీ శేషమయిన కాలము శంభో!//
107.
తీరుగ నీ నామ మహిమ
పారాయణ జేయువారి పదములు గొల్తున్
సారెకు మ్రొక్కుచ్చు సన్నిధిఁ
జేరితి నెమ్మది నిడుమయ!శ్రేయము శంభో!//
108.
వినతులు సేయుచు నీదరి
వినిపించితి నీ శతకము ప్రీతిగ నన్నున్
గనుమయ్యా!నీ దాసిగ
ననిశము నీకిత్తు భక్తి హారతి శంభో!//

కామెంట్‌లు