సునంద భాషితం;- వురిమళ్ల సునంద, చికాగో అమెరికా
 న్యాయాలు -567
ధారా వాహిక న్యాయము
 *****
ధారా అనగా మీది నుండి పడు నీరు మొదలైన వాని చాలు,కత్తి  మొదలైన వాటి వాదర, పాత్రలాంటి వాటికి పడిన చిల్లి,అశ్వగతి,ఏదేని వస్తువు యొక్క అంచు,కొండ కొన, చక్రము లేక చక్రపు పరిధి, ఉద్యానవనపు గోడ, సేనా ముఖము,ఒక పట్టణము,ఉత్కర్షము, ప్రవాహము,జడి వాన,పరంపర ,సమానత. ధారా వాహిక అనగా ఎడతెగక యుండునది,కొనసాగునది అనే అర్థాలు ఉన్నాయి.
అవిచ్ఛిన్నంగా ధార వలె ఏదైనా ఒక వస్తువును గురించి కొనసాగే ఆలోచనల పరంపరను "ధారావాహిక న్యాయము" అంటారు.
తైలము ( నూనె), నీరు, పాలు మొదలైన వాటి ధారవలె అవిచ్ఛిన్నంగా ఏదైనా ఒక వస్తువును  లేదా విషయాన్ని మననం చేసుకోవడం.ఇది ఎలా అంటే ఏదైనా ఒక వస్తువును లేదా  విషయాన్ని గురించి మనం ఆలోచన మొదలు పెడతామో ఆ వస్తువు కంటికి కనపడినా, కనబడకున్నా, క్షణములో నశించినా,నశించక పోయినా, మరొక రకముగా స్వరూపాన్ని పొందినా,పొందక పోయినా... అది ఎలాంటి స్థితి అయినప్పటికీ ఆ వస్తువు లేదా విషయానికి సంబంధించిన ఆలోచన మాత్రం ఎడతెగకుండా, నిరంతరం ఆగకుండా ప్రవహించే నీటి లేదా తైల ప్రవాహం వలె కొనసాగుతూనే వుండటాన్ని మన పెద్దవాళ్ళు"ధారా వాహిక న్యాయము"తో పోలుస్తూ వుంటారు.
 ధారా వాహిక అనగానే ఎవరికైనా పత్రికల్లో పరంపరగా వారం వారం ఆగకుండా వచ్చే సీరియళ్ళు మరియు టీవీ చానెళ్లలో  వివిధ పేర్లతో వచ్చే ఎపిసోళ్ళు గుర్తుకు వస్తుంటాయి.
 ఏదైనా ఒక విషయాన్ని గురించి సాగతీసి  రోజులు, వారాలు సంవత్సరాల తరబడి తీసే ఈ ధారావాహికలపై  సరదాగా చెప్పుకునే   హాస్య గుళికను చూద్దాం."ఓ  ఉరిశిక్ష పడిన ముద్దాయిని చివరి కోరిక కోరుకో అంటే  ఫలానా  సీరియల్ అయిపోయేంత వరకు చూడనీయండి అన్నాడట. ఆ సీరియల్ అతడు ముసలి వాడై సహజ మరణం పొందేంత వరకు అయిపోదని అర్థమన్న మాట.
 ఇది కేవలం హాస్యం మరి మన మనసుకు సంబంధించి చూస్తే...
కేవలం వస్తువనే కాదు ఇష్టమైన లేదా కష్టమైన అనుభవం లేదా  సంఘటన ఎదురైతే మనసు పదే పదే అదే విషయాన్ని గుర్తు తెచ్చుకుని నిరంతరం అవే ఆలోచనలతో మునిగి పోతుంది.
దాని వల్ల  ప్రయోజనం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన బెట్టి  ఆపలేని జలధారలా ఆలోచనల ప్రవాహంలో కొట్టుకొని పోతూనే ఉంటుంది.
 అందుకే ఆధ్యాత్మిక వాదులు ఈ న్యాయమును దృష్టిలో పెట్టుకొని ఏమంటారంటే ఎలాగూ ధారావాహికంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని తదేక నిష్ఠతో నీటి ధారను  పచ్చని పొలాల వైపు మళ్ళించితే పసిడి పంటలు పండినట్లు మనసులోని ఆలోచనలను దైవం వైపు మరల్చినట్లయితే పరమాత్మ సన్నిధి తప్పకుండా ప్రాప్తిస్తుందని అంటారు.
 ఈ "ధారావాహిక న్యాయము"ను  మనం చేసే మంచి పనులకు అన్వయించుకోవచ్చు.తదేక నిష్ఠతో చేపట్టే సామాజిక, సాహిత్య,సేవా కార్యక్రమాలు ఏవైనా మనసుకు అంతులేని తృప్తిని ఇస్తాయి.అంతకు మించిన కలిగే మంచి ఫలితాలతో  ఆత్మసంతృప్తి పొందవచ్చు. అంతే కదండీ!

కామెంట్‌లు