సుప్రభాత కవిత ; -బృంద
నిరతమూ ముందుకే సాగుతూ
ఎవరెంత పిలిచినా ఆగక....
ఎత్తు పల్లములు  దారి నిండినా
ఆగకుండా ....పరుగు ఆపకుండా
ముందుకే సాగే  ప్రవాహం
కాదా మనకు స్ఫూర్తి!

లోతున నిలిచిన నీటికి
ఎదలోతున దాగిన మాటకీ
కదులుతున్న కాలంలోనూ
కరిగిపోని మమతలన్నీ
కలిసిగట్టుగ  కట్టిన మూట
మరపురాని గురుతు కాదా!

కొత్త నీటిలో  కలిసిపోక
గుండెగూటిలో నిదురించి
నిండు మనసును నడిపించే
స్వఛ్ఛమైన ఉత్సాహమిచ్చే
తప్పనిసరిగా గుర్తొచ్చే జ్ఞాపకాలు
విప్పని తలపుల పొట్లమే కాదా!

చీకటి ముసిరిన ముంగిట
వెలుగుల ముగ్గులేసి
తెరచిన తలుపుల ముందర
కలల జాతరలా అనిపించే
వెలుతురు పరచిన తివాచీగా
జిలిబిలిగ మెరిసేది జీవితమేగా!

అడుగు ముందుకేసే అవకాశం
అలుపు అనిపించని అనుభవం
అంతరంగాన చెదరని ధైర్యం
అనుగ్రహంగా అందించి
ఆనందపు గాలివాటున నడిపించే
అరుదైన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు