కొవ్వొత్తుల మాటా మంతీ;- - యామిజాల జగదీశ్
 నాలుగు కొవ్వొత్తులు ఒక గదిలో ప్రశాంతంగా వెలుగుతున్నాయి. నెమ్మదిగా కరిగిపోతున్నాయి. ఇదంతా నిశ్శబ్దంగా సాగిపోతుండటంతో వాటి అంతరంగాన్ని వినడానికి నేనూ మౌనం వహించాను.
అప్పుడు మొదటి కొవ్వొత్తి "నేను శాంతిని. కానీ సమస్యేమిటంటే ఈ ప్రజలున్నారు చూసావూ... నన్నెలా నిలుపుకోవాలో  తెలీదు. కనుక నేను చేయవలసిందేమీ లేదు..." అంటూ ఆరిపోయింది. 
అప్పుడు రెండవ కొవ్వొత్తి "నేను నమ్మకాన్ని... కానీ  దురదృష్టవశాత్తూ నేను ఎవరికీ అవసరం లేదు... అసలు నా గురించి వినడానికి ఇష్టపడరు... కనుక నేను మరింతసేపు వెలగడంలో ఏ మాత్రం అర్థం లేదు..." అని అంటుండగా గాలి వీచి ఆ కొవ్వొత్తిని ఆర్పేసింది.
అనంతరం మూడవ కొవ్వొత్తి విచారవదనంతో "నేను ప్రేమను. కానీ ప్రజలు నన్ను మెచ్చుకోవడం అటుంచు.... నన్నర్థమూ  చేసుకోరు. అందుకే నాకు వెలగాలనే ఆసక్తి లేదు" అంటూ ఆరిపోయింది.
ఇంతలో అకస్మాత్తుగా, ఒక పిల్లాడు గదిలోకి వచ్చాడు. అప్పటికే ఆరిపోయిన మూడు కొవ్వొత్తులనూ చూశాడు. భయపడిపోయి, వెలుగుతున్న నాలుగో కొవ్వొత్తితో "ఎందుకా మూడు కొవ్వొత్తులూ ఆరిపోయాయి? నువ్వయినా ఆరిపోకు. నీ వెలుగు కావాలి. ఎందుకంటే నాకు చీకటి అంటే చాలా చాలా భయం" అని అరిచాడు. ఏడ్చాడు.
అప్పుడు నాల్గవ కొవ్వొత్తి "భయపడకు. ఏడుపు ఆపు. నేను మండుతున్న  నాతో నువ్వు మిగిలిన మూడింటినీ వెలిగించొచ్చుగా... ఆ దృశ్యం చూడాలని నాకు ఆశగా ఉంది" అని చెప్పింది.

కామెంట్‌లు