అలుముకున్న అంధకారం
అలాగే వుండిపోదుగా!
జరిగి జరిగి ప్రతి క్షణం
కదిలి వెళ్ళి పోవుగా!
ఆకులన్ని రాలిపోతే
ఆవేదన పడితే ఎలా?
ఆగి చూస్తే రాదా చిగురు
ఆక్రోశం అవసరమా?
దారే లేదని బాధపడితే ఎలా?
రాళ్ళు ముళ్ళు ఏరి..కొత్త
దారి చేసుకుంటూ సాగితే
వెంట వచ్చు వారూ వుంటారుగా!
ఎండ మాడ్చేస్తోందని
ఏడ్చి గొడవ చేయక!
వెలుగు వుంది పయనంలో
కావలసినదేమిక?
చీకటైందని దిగులు పడితే
రాక తప్పునా రాత్రి!
ఏకబిగిని నడకలేలా?
సేద దీరవచ్చుగా కాస్త ఆగి!
నిద్రపోక మేలుకుని
నిశి మొత్తం గడిపేస్తే
కోరుకున్న రేపటి కోసం
కమ్మని కలలు చూసేదెలా?
కలలోనే రూపుపోసి
కనులలో కొలువు చేసి
కలగన్న తీరాలను కలిసే
కసి పెంచుకు తీరాలిగా!
వెలుగుదారి పిలుస్తోంది
వేకువ వచ్చేస్తోంది
పిలుపు అందుకోవాలి
కదిలి సాగిపోవాలంటూ
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి