సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-654
యథా రాజ న్యాయము
****
యథా అంటే కేవలం లేదా ఎలా ఎట్లు అని అర్థం.రాజా అంటే రాజు,ప్రభువు , పుడమి ఱేడు రాచవాడు, యక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు అనే అర్థాలు ఉన్నాయి.
"యథా రాజా న్యాయము అంటే "రాజు ఎలా వుంటే ప్రజలు అలాగే వుంటారు"  అని అర్థము.దీనినే యథా రాజా తథా ప్రజా "అని కూడా అంటారు. 
అంటే "రాజు గానీ  పాలకులు గానీ ఎలా వుంటే రాజ్యంలోని ప్రజలు అలాగే వుంటారు" అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
నిత్య జీవితంలో  ఈ నానుడి తరచూ వింటూ ఉంటాం.
 అసలు  ఈ నానుడికి సంబంధించిన  శ్లోకాన్ని మొత్తంగా చూద్దాం.
"రాజా రాక్షసశ్చైవ శార్థూలాః తత్ర మంత్రిణః/ గృధ్రాశ్చ సేవకాస్సర్వే తథా రాజా తథా ప్రజాః"అనగా...
 రాజును బట్టే  రాజ్యంలోని మంత్రులు, సేవకులు, ప్రజలు ఉంటారు. ఒక వేళ రాజు దుష్టుడైతే,రాక్షసునిలా వుంటే మంత్రులు శార్థూలాః "అంటే పెద్ద పులుల్లాగా, సేవకులు గద్దల్లాగా,ప్రజలూ అలాగే ప్రవర్తిస్తారు.
అదే రాజు మంచివాడుగా నీతి నియమాలు పాటిస్తూ ధర్మవర్తనతో ,సత్య వాక్కుతో రాజ్యంలోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పాలిస్తే ప్రజలు కూడా రాజును అనుసరిస్తూ వుంటారు. అందుకే  "రాజును బట్టే ప్రజలని" "యథా రాజా తథా ప్రజా" అనే సామెత వాడుకలోకి వచ్చింది.
ఖమ్మం వాస్తవ్యులైన యర్రం విశ్వనాథ గుప్త గారు రాసిన గుంటుమల్లేశ్వర శతకంలోని ఓ పద్యాన్ని చూద్దాం.
"కుజనుల్ గొందరు రేగి ఈ వసుమతిన్ కౄర స్వభావంబుతో/ సుజనావళిన్గడు గుందజేయునెడ రాజుల్ వారి వారింపకే/ నిజ దౌర్బల్యము జూపిరేని చెడదా నిక్కంబుగా రాజ్యమో/ త్రిజగత్కారణ! భక్త పాలన! హరా! శ్రీగుంటు మల్లేశ్వరా!"
సజ్జనుల బాధలు నివారించ వలసిన వారు రాజులు. దుర్మార్గులు విజృంభించి కౄర స్వభావముతో సత్పురుషులను బాధించేటప్పుడు,ఆ చెడ్డ వారిని దండించవలసిన బాధ్యత రాజులది.అంతే కానీ రాజులు తమ బలహీనతను, దౌర్బల్యమును ప్రదర్శిస్తే, అలా చేస్తే అంటే  అసమర్థుడైన రాజు వల్ల రాజ్యం చెడిపోతుందని అంటే రాజు సమర్థతను బట్టి రాజ్యం వుంటుందని భావం.
దీనికి దగ్గరి అర్థం వచ్చే కొన్ని తెలుగు సామెతలను చూద్దామా ...
 "ముందు నాగలెట్ల పోతే వెనుక నాగలట్లా పోతుంది"  అంటే  వ్యవసాయానికి నాగళ్ళు కట్టినప్పుడు ముందు మంచిగా చెప్పినట్లు వినే ఎద్దుల నాగలి కడతారు. ఆ నాగలి యజమాని సూచనలకు బాగా అలవాటు పడి వుండటం వల్ల, అనుభవంతో ఒక మడి దున్నగానే మరో మడిలోకి వెళుతుంది.అది చూసిన వెనుక నాగళ్ళు దానిని అనుసరిస్తూ వుంటాయన్న మాట.
మరో సామెత "ఆవు చేలో మేస్తే,దూడ దుగాన అంటే గట్ఠున మేస్తుందా?" అంటారు.
బుద్ధులు చెప్పాల్సిన తల్లి ఆవే చేలో మేస్తుంటే అది చూసిన దాని దూడ ఊరుకోదు కదా! తల్లి లాగే చేలో మేస్తుంది.
ఏ ఇంట్లోనైనా తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకులు.  వారి అలవాట్లను, ఆలోచనలను,ప్రవర్తనను, భావోద్వేగాలనూ పిల్లలు నిశితంగా గమనిస్తూ ఉంటారు. వారిలాగే తమ వైఖరులను పెంపొందించుకుంటారు.
ముఖ్యంగా బడిలో పిల్లలను గమనించినప్పుడు ఈ వైఖరులు స్పష్టంగా కనబడుతుంటాయి.
 గొడవల మారి కుటుంబంలోంచి వచ్చే పిల్లలు  ఇంట్లో వాళ్ళకు నకలుగా వుండి ,బడిలో కూడా సమస్యలు తీసుకు రావడం చూస్తుంటాం.కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు తాము సరైన విలువలు పాటిస్తూ పిల్లలు వాటిని పాటించేలా చూడాలి.
ఇదండీ! యథా రాజ న్యాయము లోని నిగూఢమైన అర్థం. ముఖ్యంగా కుటుంబమే సమాజాన్ని ప్రభావితం చేసే, ప్రతిబింబించే దర్పణం కాబట్టి ఇంట్లో నుండే ఉత్తమ వైఖరులున్న పౌరులు సమాజంలోకి రావాలంటే  ప్రతి తల్లీ, తండ్రీ ఈ "యథా రాజ న్యాయము"ను గమనంలో పెట్టుకోవాలి.


కామెంట్‌లు