సునంద భాషితం:-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-698
వైరాగ్య న్యాయము
****
వైరాగ్యం అంటే  విరక్తి, అయిష్టత, నిరాసక్తత, విముఖత అనే అర్థాలు ఉన్నాయి.
 మరెందుకు వైరాగ్యం కలుగుతుంది? దేని మీద కలుగుతుంది? కలిగిన వైరాగ్యం ఎంత సేపు వుంటుంది?  వైరాగ్యంలో రకాలు ఎన్ని మొదలైన ప్రశ్నలు మనలో చాలా మందిలో ఉత్పన్నమవుతుంటాయి. వాటి వివరాలను కూలంకషంగా అధ్యయనం చేద్దాము.
 
 ముందుగా వైరాగ్యం అంటే ఏమిటో చూద్దాం.
 వైరాగ్యం అంటే కనిపించే వస్తువులు, భౌతిక పదార్థాల మీద పూర్తిగా విముఖత కల్గి ఉండటమే కాదు ఈ ప్రపంచం ఒక మిధ్య అని భావిస్తూ వాటన్నింటికీ దూరంగా ఉండటం కోసం చేసే ప్రయత్నాన్ని, ఏమిటో ఈ జీవితము అనుకోవడాన్ని,వాపోవడాన్ని వైరాగ్యం అనొచ్చు.
 ఈ వైరాగ్యంలో ముఖ్యంగా నాలుగు రకాల వైరాగ్యాలు మనసునూ, మనిషిని ఆవహిస్తుంటాయి. అవి 1. పురాణ వైరాగ్యం.2. స్మశాన వైరాగ్యం 3.ప్రసూతి వైరాగ్యం.4.ఆర్థిక వైరాగ్యం.
మొదటి వైరాగ్యం పురాణ వైరాగ్యం. ఇది తాత్కాలికమైనది. ప్రవచనాలు,పురాణాలు  విన్నప్పుడు కలిగేది. పురాణ గాథల్లో ఆయా వ్యక్తులు పడిన కష్టాలు విని అయ్యో! అంత గొప్ప వాళ్ళకే ఇన్ని కష్టాలు. ఇక మనమెంత? ఏమిటో ఇదంతా అనే భావన ఒకలాంటి ఉప్పెనలా వచ్చి మనసును ఆవహిస్తుంది. అలా విన్న కొద్దీ జీవితమంటే విరక్తి కలుగుతుంది. ఇదంతా అక్కడ ఉన్నంత వరకు మాత్రమే అలా అనిపిస్తుంది. ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతా షరా మామూలే.ఇంటికి రాగానే పనుల్లో బడితే కలిగేది వైరాగ్యం కాదిక అది తాపత్రయమే.
ఇక రెండో రకం వైరాగ్యం స్మశాన వైరాగ్యం. ఇది అత్యంత ఆత్మీయులను, బంధువులను, స్నేహితులను కోల్పోయినప్పుడు కలిగే వైరాగ్యం. స్మశానంలో ఆ తంతు అంతా చూశాక ఇంతే కదా జీవితం ఎవరికి ఎవరు? ఏది  శాశ్వతం అనుకుంటే వచ్చే వైరాగ్యం. ఇది ఆ ప్రదేశంలో ఉన్నంత వరకు, ఆ కన్నీళ్ళు , ఏడుపు చూసినప్పుడు ఉంటుంది. అక్కడి నుంచి వెలుపలికి వస్తే మళ్ళీ మామూలు స్థితికి వస్తాం.
 ఇక మూడోది ప్రసూతి వైరాగ్యం.ఇది మహిళలకు వస్తూ ఉంటుంది. పురిటి నొప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పడే బాధ తట్టుకోలేక ఇంకొక సారి పిల్లలు అనే ఊసే ఎత్తవద్దు అనుకోవడం.అదీ తాత్కాలికమే.పిల్లల మీద మమకారం ఇంకొంతమందిని కనేలా చేస్తుంది.
చివరిదైన వైరాగ్యం ఆర్థిక సంబంధమైన వైరాగ్యం. సంపాదన మోజులో పడి జీవితాన్ని కోల్పోయిన తర్వాత ఇదంతా సంపాదించిన దాని వల్ల ఏం ఉపయోగం? ఏం సాధించాను అనుకోవడం.అలాగే ఆర్థికంగా చితికి పోయినప్పుడు, తాను చేసే వ్యాపారంలో నష్టాలు రావడంతో కలిగే వైరాగ్యం.ఇలా ఆర్థిక పరమైన  విషయాల గురించి వాపోతూ వుండటం  ఆర్థిక వైరాగ్యం అంటారు.
వీటితో పాటు నిత్య జీవితంలో అనేక రకాల వైరాగ్యాలు కలుగుతూ వుంటాయి.అయితే వీటన్నింటినీ పోగొట్టే అద్భుతమైన శక్తి కాలానికి వుంది. అందుకే కాలం మరుపు అనే మందుతో గాయాల్ని మాన్పుతుంది అంటారు.
ఇవే కాకుండా డబ్బు, ఆయుష్షు, అహంకారం, చిత్తము,ఆశ, తనువు, యవ్వనము, రూపము, ముసలితనము, కాలము, గృహస్థ వైరాగ్యం.. ఇలా ఎన్నో వైరాగ్యాలు ఉన్నాయి.
ముఖ్యంగా మనిషిలో రావలసిన వైరాగ్యం ఏమిటంటే ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు కేవలం అతిథులమే. అది గ్రహించి పంచభూతాలను కాపాడుతూ వాటి వలె త్యాగ నిరతిని అలవర్చుకోవడం.ఇవే మన పెద్దవాళ్ళు చెప్పే అమూల్యమైన సూక్తులు. వాటిని గమనంలో పెట్టుకొని మనుగడ సాగిద్దాం.

కామెంట్‌లు