సుప్రభాత కవిత :- బృంద
తీగలపై అందంగా విరిసి 
హాయిగా చినుకుల తడిసి
హేలగా డోలికలూగుతూ
కేరింతల సోలి తూలే 
సుమబాలది ఎంత స్వేచ్ఛ!

నీలాల గగనాన దూర తీరాల 
సాగుతూ నిలిచి చూసి మురిసి 
పొంగిన ప్రేమను చినుకులో నింపి 
సందేశముగా లతను తడిపిన 
మేఘమాలదెంత ప్రేమ!

కొలువుకోసం దూరమేగిన 
తండ్రి పంపిన కానుకలు 
చూసుకుని సంబరమున తేలు 
పసిపిల్లల వోలె తల్లితీగ ఒడిలో 
ఆడే కుసుమాలదెంత ఆనందం!

ఆనంద భాష్పములై 
రెక్కల రెప్పలపై నిలిచిన 
నీటి బిందువు పైన వాలి 
సప్తవర్ణముల వెలువరించు 
తొలివెలుగు కిరణపు 
మెరుపుదెంత అందం!

అనుకున్న కబురంది 
అలజడులు నెమ్మదించు 
తాయిలమేదో తెచ్చు 
తూరుపు వేలుపు మదిలోని 
కరుణదెంత  విలువ!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు