న్యాయములు -717
శ్వస్కార్య మధ్య కుర్వీత న్యాయము
******
శ్వస్ అనగా ఆ, రేపు . కార్య చేయదగినది,చేయదగిన పని,ప్రయోజనము. మధ్య నడిమిది,లోపలనున్నది.కుర్వీత అనగా చేయాలి అని అర్థము.
రేపటి పనిని ఇవ్వాళనే పూర్తి చేసుకొనుట క్షేమకరము అని అర్థము.
నేటి పని సయితం సోమరితనం చేత రేపటిపై పెట్టకుండా రేపు చేయాల్సిన పని సైతం ఈనాడే చక్కబెట్టుకునే వ్యక్తి తప్పకుండా ఉన్నతి పొందుతాడు.
అంటే -అవ్యగ్రతతో కార్యములందు ప్రవర్తించుట క్షేమకరమని చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థము.
"రేపు చేయవలసిన పని ఈరోజు చేయి... ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి..."ఈ మాటలను అన్నది సంత్ కబీర్ దాస్ గారు.
ఇందులో ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉంది. వ్యక్తిగా ఎవరైనా సరే ముందుగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి.కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన దినచర్యను రాసుకుని ఒక క్రమ పద్దతిలో దానిని పాటించాలి, చక్కగా అవలంబించాలనీ శాస్త్రాలు చెబుతున్నాయి.ఎందుకంటే కాలం మన కోసం ఆగదు.క్షణక్షణానికి పాదరసంలా జారిపోతుంది.మంచుగడ్డలా కరిగిపోతుంది.
మనము ఎప్పటికీ కాలం ముందు ప్రేక్షకులమే.ఎందుకంటే రకరకాల సంఘటనలను, సన్నివేశాలను చూపించి,తన ఆంతర్యం అర్థం చేసుకోమని చెప్పకనే చెబుతూ... చూస్తూ ఉండగానే గంటలు రోజులుగా, రోజులు నెలలుగా,నెలలు సంవత్సరాలుగా మారిపోతూ వివిధ రకాల పేర్లతో విచిత్రంగా మన ముందు కదిలిపోతుంది.ఇలా పుట్టినప్పటి నుంచీ మరణించేంత వరకూ కాలం మనిషి జీవితంతో పెనవేసుకుని సాగిపోతూ పోతూ ఈ ప్రయాణం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడా వ్యక్తిని వదిలేసి పోతుంది.దీనిని కాల సత్యం అని అనవచ్చు .
కాలం అందరినీ ఒకే విధంగా చూస్తుంది.దానిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఆయా వ్యక్తుల కార్యాచరణ సామర్థ్యాన్ని బట్టి వుంటుంది.
ఉదాహరణకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందరికీ ఒకే విధంగా పాఠాల్ని బోధిస్తాడు. కానీ దానిని గ్రహించడంలో ఉన్న వైవిధ్యం విద్యార్థులలో సామర్థ్యాన్ని వివిధ స్థాయిల్లో చూపుతూ వుంటుంది.అలాగే కాలాన్ని కూడా ఎవరు? ఎలా ఉపయోగించుకున్నారు? అనే దానిపై వారి వారి అభివృద్ధి,ఉన్నతి,స్థాయి నిర్ణయించబడుతుంది.
ప్రతిభ,మేధస్సు, కృషి, పట్టుదల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
కాలం గురించి మన పెద్దలు ఎన్నో సామెతలు జాతీయాలు సృష్టించి దాని గొప్పదనాన్ని మహిమను అర్థం చేసుకునేలా చేశారు. కాలం, "కెరటం ఒకరికోసం ఆగవు ",కాల మహిమ","కాలమొక నియంత", "బంగారంలో చిన్న ముక్కకు ఎంత విలువ వుందో కాలంలో ప్రతి క్షణానికి విలువ వుంది."... ఇలా బోలెడు ఉన్నాయి.
ప్రముఖ సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కాలం గురించి "కాలం ఒక ప్రవాహం.అది నిత్యం పరుగెడుతుంది. మనకు ఎన్నో విలువైనవి బహుమతిగా అందించి తీయని గుర్తులను మిగులుస్తుంది. అంటూ "నిన్నయినా నేడైనా రోజన్నది ఎపుడైనా/ ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా/ ఏ పూటకు ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే/ ఈ వింతను గమనించే వీలున్నది కాబట్టి/ మన సొంతం కాదా ఈ క్షణమైనా" పాటను అద్భుతంగా రాశారు.అలాగ వాగ్గేయకారుడుగా, కవిగా పేరు పొందిన మేడగాని శేషగిరి గారు కాలం గురించి రాసిన చక్కని పాటలో ఇలా అంటారు."కాలం పదే పదే హెచ్చరించింది / నన్ను వెంబడించింది.. అంటూ .కాలం చేయి పట్టుకొని ఎలా నడవాలో, ఏవిధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలో చెబుతారు.
అయితే మనం కాలాన్ని సరిగా వినియోగించుకోక చేసిన పొరపాట్లతో కూడిన గతాన్ని గుర్తు చేసుకుని బాధ పడటం మళ్ళీ కాలాన్ని వృధా చేస్తున్నట్లే.కాబట్టి గతం ఎప్పుడూ కరిగిన కల లాంటిది.తిరిగి రాదు. భవిష్యత్తు అనేది చిగురించే మొక్క లేదా చెట్టు కల.కానీ మన చేతుల్లోనే ఉన్న ఈ రోజును ఏవిధంగా ఫలవంతం చేసుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుందనేది మరచి పోవద్దు.
రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయలేక పోయినా రేపైనా ఖచ్చితంగా చేయగలిగేలా దానికి సంబంధించిన ప్రణాళిక ఉండాలి.దీనికి ఉదాహరణగా మన పెద్దలు నెపోలియన్ ఉదంతం చెబుతుంటారు. ఓసారి నెపోలియన్ గాఢంగా నిద్ర పోతున్న సమయంలో సైన్యాధిపతి వచ్చి శత్రు సైన్యం దక్షిణ దిక్కు నుండి చొచ్చుకొని వస్తోంది ఏం చేయాలో తోచడం లేదు అని కంగారు పడుతూ లేపాడట.అయితే తాను అలాంటి శత్రు సైన్యాన్ని ఎదుర్కునే వ్యూహాన్ని ముందే గోడ మీద నంబరు పద్దతిలో రాసుకుని వుండటం వల్ల ఫలానా నంబరు పద్దతిలో ఎదుర్కొమ్మని చెప్పాడట. అలా వుండాలి.భవిష్యత్తు ప్రణాళిక.
ఇవండీ !"శ్వస్కార్య మధ్య కుర్వీత న్యాయము" ద్వారా మనం గ్రహించాల్సిన, నేర్చుకోవాల్సిన నీతి సూత్రాలు.
ఇక సరదాగా కాలం గురించి ఓ ముచ్చట చెప్పుకుని ముగిద్దాం.
ఇదొక సరదా సంభాషణ విందామా..ఒక ఉపాధ్యాయుడు రోజూ పాఠాల బోధనలో భాగంగా ఓరోజు "శ్వస్కార్య మధ్య కుర్వీత"-"రేపటి పనిని ఈరోజే చేయండి" అని బోధించాడు. ఓ కొంటె పిల్లవాడు 'అయ్యా! రేపు నేను చచ్చిపోవుదును.'అన్నాడు.వెంటనే ఉపాధ్యాయుడు- అట్లయితే 'నేడే ఆ పని చేయి.' అది చాలా మంచిది అన్నాడట.విన్న ఆ కొంటె పిల్లవాడు గురువు మాటలకు షాకై పోయి తలొంచుకున్నాడట.
కాలాన్ని పరిమళభరితం చేసుకోవాలనుకుంటే అక్షర సత్యాలైన పెద్దల మరియు కబీర్ దాస్ గారి లాంటి వారి విలువైన సుభాషితాలను విని ఆచరణలో పెట్టాలి.తద్వారా మనమేంటో ఋజువు చేసుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి