అమూల్య కళ :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
సంతోషం ఒక తోఫా 
అక్షరబంధం సోపతి
మైదాన ఆటల మనసైన మాటల మనిషిలో

బతుకున గొప్ప కళ 
బతికీ బతికించే అలవాటు 
మనసులనూ మనిషిని మనిషితో కలిపే కావ్యం
అనిర్వచనీయ కరచాలనం 

నేను అతనితో కలిసేది 
అతడు నన్ను పలకరించేది
మొదట చూపుల కరచాలనమే

ఎవరైనా నీవు
వృత్తి వ్యాపకం ఏదైనా
భేషజాల ఇగోలన్నీ 
దరికిరానంత దూరంలో వదిలి
నాటి పల్లెమనసు మనసుతో
దండాలనే మాట
నునువెచ్చని ఎదల కరచాలనం

రాయని రాతల గీయని బొమ్మల
భావోద్వేగాల ప్రవాహం
ఇరుగు పొరుగు కవులూ కళాకారుల

 ఆత్మీయ కలం సృజన స్పర్శ 
ఆనంద హర్షాతిశయాల అక్షరచాలనం
అనిర్వచనీయం కరచాలనం

ఘనమైన సాహిత్య సోయగాలన్నీ
మట్టకు రాసుకున్న అత్తరు వాసనతో
అనుకొనో అనుకోకనే హత్తుకొవడమే
 అభినందించదగ్గ కవిత 

ఎవరు చేసినా రాసినా 
అద్భుతం శ్రమ అందాలన్నీ! 
తనివితీరా మెచ్చుకోగల ఆత్మీయ వేళ్ళు
అలవోకగా అప్రయత్నంగా 
నిమరడమే ఆలోచించదగ్గ 
మానసిక ఉల్లాసంలో ఉద్విగ్నం 
దారెంట కలిసి నడవడమే అమూల్య కళ

====================================

(21.12.24 న  వారాల ఆనంద్ వ్యాస సంపుటి 'కరచాలనం' ఆవిష్కరణ సందర్భంలో...)
కామెంట్‌లు