సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-726
సర్వాపేక్ష న్యాయము 
    *****
సర్వ అనగా సమస్తము, అంతయు.ఆపేక్ష అనగా ఆశ ,ఆశించు,ఇచ్ఛ,ఇష్టము,కోరిక అనే అర్థాలు ఉన్నాయి.
ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మొత్తం తనకే కావాలనే కోరిక ఇష్టం ఒకటైతే, మరొకటి సమిష్టి భావన. మన పెద్దలు సమిష్టి భావననే ఉదాహరణగా తీసుకుని ఈ న్యాయాన్ని రకరకాల ఉదాహరణలతో పోల్చి చెప్పడం జరిగింది.అవేమిటో చూద్దామా.
"సర్వ సంఘాతముపై ఆధారపడినట్లు" అనగా 'మొత్తము  సమూహముపై ఆధారపడినట్లు ' అని శబ్ద సమూహమునకు చెప్పబడిన అర్థము.అయితే అందులో అవయవములుగా ఉన్న ప్రత్యేక పదములకు  అన్వయించరు.పలువురిచే కావలసిన పనిని వారిలోని వాడొక్కడే చేయలేడు కదా! అని అర్థము.అంటే వ్యక్తిగతంగా కాదు సమూహంగా గుర్తించాలని అర్థము.
ఏదైనా సామూహికంగా చేసే పనులను గురించి అందరికీ కలిపి వర్తింపజేసి చెబుతారు కానీ అందులో ఏ ఒక్కరినే ప్రత్యేకం చేసి చెప్పరు.ఇందులో బాగా పనిచేసేవారు ఉండొచ్చు లేదా చేయని వారు ఉండవచ్చు.ఏ ప్రభావమైనా  సమూహం మొత్తానికి చెందుతుంది.ఇందులో విశ్వసనీయత,సమగ్రత,ఏకత అనే భావన యిమిడి వుంది.
దీనికి సంబందించిన ఓ సరళమైన వివరణ ఏమిటంటే  పైన చెప్పిన విధంగా ఒక వాక్యంలో పదాలు గొప్పవా?మామూలువా? అని కాకుండా వాక్యం లోని మొత్తానికి అర్థవంతమైన గుర్తింపు వుంటుంది.అంతేకానీ దేనికది విడదీసి చూస్తే అది కేవలం ఒక్కో పదం మాత్రమే అవుతుంది. అలాగే సమూహముగా అనుకున్నప్పుడు సమూహంగానే గుర్తించాలి అని అర్థము.
 ఏదైనా ఒక వ్యాపార సంస్థకు లాభాలు లేదా నష్టాలు వచ్చినప్పుడు ఫలానా సంస్థ అనే అంటారు గౌరవం కానీ అపవాదు కానీ అందులో బాగా కష్టపడి చేసే వ్యక్తులకు వర్తింపజేసి చెప్పరు." అనేది మనం గ్రహించాలి.
పాఠశాల విషయానికి వస్తే పదవతరగతి ఉత్తీర్ణత గురించి చెప్పేటప్పుడు ఫలానా పాఠశాలలో అంత  శాతం/ ఇంత శాతం అనే చెబుతారు కానీ అందులో ఏ ఒక్క ఉపాధ్యాయుడి గురించిన విషయం అందులో ఉండదు.ఇందులో  వ్యక్తిగతమైన కృషి ఉన్నప్పటికీ వ్యక్తిగా గుర్తింపుగా  కాకుండా సమూహంగానే ఉంటుంది.
 ఒకప్పుడు సమిష్టి కుటుంబాలు ఉండేవి అందులో ఎవరి సామర్థ్యానికి సంబంధించిన పనులు వారు చేసేవారు. ఒకోసారి అందులో ఏ పని చేయలేని పసిపిల్లలు,సోమరులు కూడా ఉండేవారు కానీ వారిని విడదీసి చెప్పడం కాకుండా ఆయా కుటుంబాల గురించి మొత్తంగా చెప్పేవారు. ఇందులో "సర్వాపేక్ష న్యాయము" అంతర్లీనంగా దండలో దారంలా ఉండేది.
"కలిసి ఉంటే కలదు సుఖం" అనే సూత్రం ఈ న్యాయములో బలంగా ఉందని చెప్పవచ్చును.
కేవలం కుటుంబమే కాకుండా  సమస్త వ్యవస్థల్లో, రంగాల్లో ప్రజల శ్రమ, మేథస్సుతో కూడిన సంఘీభావం ఆయా వ్యవస్థలను, రంగాలను బలోపేతం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి,అనుమానం లేదు.
 నేను,నాది అనే సంకుచిత భావన నుండి మనది, మనం అనుకునే విశాలమైన భావన ప్రతి మస్తిష్కంలో వికసించిననప్పుడు ఆ  మానవీయ పరిమళం సమాజమంతా గుబాళిస్తుంది.కుటుంబం మొదలుకొని దేశం దాకా విస్తరించిన ఐకమత్యం, సంఘీభావం అత్యున్నత స్థాయిలో అందరిచే గౌరవింపబడేలా చేస్తుంది.
కాబట్టి  నేను నాది అనే స్వార్థపూరిత ఆలోచనల నుంచి మనది మనం అనే దిశగా అడుగులు వేయాలని చెప్పడానికే మన పెద్దవాళ్ళు ఈ "సర్వాపేక్ష న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు. మరి మనం  కూడా ఎప్పుడూ  "సర్వాపేక్ష న్యాయము"ను  అనుసరిద్దాం.ఆత్మ తృప్తితో ఆనందంగా ఉందాం.

కామెంట్‌లు