మరింత భద్రత ప్రమాణాలతో విద్యుత్ వాహనాల తయారీ:- సి.హెచ్.ప్రతాప్

 శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్న్యాయ వనరులను అభివృద్ధి చేయాలన్న పారిస్ తదితర పర్యావరణ శిఖరాగ్ర సమావేశాలలో నిర్ణయించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సంప్రదాయ పెట్రోల్, డీజల్ పై నడిచే వాహనలకు మారుగా విద్యుత్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. మహీంద్రా, బజాజ్  తదితర దిగ్గజాలు విద్యుత్ వాహనాల తయారీపై దృష్టి పెట్టి వాటి కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. విద్యుత్ బస్సులు, జీపులు ఇప్పుడిప్పుడే వాడకంలోకి వస్తున్నాయి. అయితే విధ్యుత్ స్కూటర్లు మాత్రం ఒక ప్రహసనంగా మారింది. వీటిలో 95 శాతం వాడుకలో అధ్వాహనం గా వున్నాయి.    దేశవ్యాప్తంగా చాలా చోట్ల విద్యుత్ స్కూటర్లు తగులబడిపోవడమో, బ్యాటరీలు పేలిపోవడమో వరుసపెట్టి జరుగుతున్న నేపథ్యంలో ఈవీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. కొన్ని వాహన తయారీ సంస్థలు మార్కెట్ నుంచి వాహనాలను ఉపసంహరించుకున్నాయి. ఈవీల భద్రత, నాణ్యతలను పరిశీలించేందుకంటూ ప్రభుత్వం ఇటీవల నిపుణుల కమిటీని నియమించింది ఈ చర్యలు ఉపశమనాన్నిచ్చేవే కానీ, పరిష్కారం కాదు. ప్రజల్లో ఈవీల పట్ల భయం హెచ్చితే వాటివైపు కన్నెత్తిచూడడానికి కూడా ఇష్టపడరుఅని ప్రభుత్వం త్వరగా గ్రహించాలి. దేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పత్తిచేసే మొత్తం వాహనాలతో పోల్చితే రోడ్లమీద తిరుగుతున్న ఈవీల సంఖ్య అతిస్వల్పమే. కానీ, బ్యాటరీ ఖరీదు పడిపోవడం, ప్రభుత్వాలు ఈవీలకు రాయితీలు, మినహాయింపులూ ఇస్తుండటంతో వాటిపై మోజు పెరుగుతున్నది అయితే సరైన డిజైనింగ్ లేకుండా,భద్రత పట్ల నిర్ధిష్ట ప్రమాణాలను పాటించకుండా తయారీ సంస్థలు ఇష్టారాజ్యంగా వాటిని తయారు చేసేస్తున్నాయి.  అంతే కాకుండా విద్యుత్ బ్యాటరీల ధర తగ్గిపోవడం, ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల తయారీ సంస్థలకు, వినియోగదారులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించడం, విదేశాల నుండి దిగుమతి అయ్యే బ్యాటరీల నాణ్యతపై ఎలాంటి నిఘా, నియంత్రణలు లెకపోవడం ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణాలు.2024 సంవసరం కల్ల దేశంలో  బ్యాటరీల విషయంలో స్వయం సమృద్ధిని సాధిస్తామని నిరుడు ఘనంగా ప్రకటించుకున్న ప్రభుత్వం ఆ దిశగా ఖచ్హితమైన ప్రణాళికలను ఇంకా అమలు చెయ్యలేదు.భారత్ లో ఉష్ణ వాతావరణానికి సరిపోయే ప్రత్యేక డిజైనింగు ను అమలు చేయాలనుకున్న  అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ ఇటీవలె తన నివేదికలో తెలియజేసింది.  భారీ జరిమానాలతో కంపెనీలను శిక్షించడం కంటే, ఒక శాశ్వత వ్యవస్థతో ఈవీ కంపెనీల సమస్త కార్యకలాపాలను నియంత్రించడం అవసరం. విద్యుత్ వాహనాల విషయంలో వినియోగదారులకు ప్రత్యేక అవగహన కుడా కల్పించాలి.విధ్యుత్ వాహనాలకు ప్రజల నుండి మెరుగైన స్పందన రావాలంటే పార్కింగ్, చార్జింగ్ వంటి వంటి సౌకర్యాలను ఉచితంగా కల్పించాలి. ఐ ఐ టి వంటి ఉన్నత సంస్థలలో విద్యుత్ వాహనల డిజైనింగ్,కావల్సిన భద్రతా ప్రమణాలపై విసృతంగా పరిశోధనలు జరగాలి. ఫ్యాక్తరీ స్థాయిలోనే పూర్తి స్థాయి భద్రతా తనిఖీలు  జరపాలి.
కామెంట్‌లు