రామాలయ నిర్మితికై రామరాజు ట్రస్ట్ ఇరవై ఐదు వేల విరాళం

 పాతపొన్నుటూరు గ్రామం కోలనీలో శ్రీశ్రీశ్రీ కోదండరామాలయ ప్రతిష్టా మహోత్సవం ఈనెల 31నుండి మూడు రోజుల పాటు జరుగుచున్న నేపథ్యంలో పాతపట్నం రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు  పారశెల్లి రామరాజు ఇరవై ఐదు వేల రూపాయలను విరాళం ప్రకటించి, సదరు చెక్కును ఆలయ కమిటీకి అందజేసారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో మనమంతా కలకాలం హాయిగా జీవించాలన్నారు. ప్రతీ గ్రామంలో దేవాలయం, విద్యాలయం, గ్రంథాలయాలనేవి ఎంతో అవసరమని, అవి మన దేశ సంస్కృతిని అవగాహన పరిచి, సాంప్రదాయాలను తెలిపి, సామాజిక బాధ్యతను నిర్దేశిస్తాయని అన్నారు. సర్పంచ్ ఎద్దు చామంతమ్మ మాట్లాడుతూ విఘ్నేశ్వర పూజతో మొదలుకొని పుణ్యాహవచనం, పరిషత్, పంచగవ్యం, రక్షాధారణ, ఋత్విక్ వరుణ, మండపారాధనలు, అగ్ని ప్రతిష్ట, అన్నప్రసాద వితరణ, కోలాటం, శంఖనాదం, దక్షిణాది సన్నాయి మేళం, హరే రామ హరే కృష్ణ భజన, చెక్క భజన, మంగళ ధ్వనులతో బాణాసంచాలతో వేద పండితుల వేదమంత్రాలతో, పసుపు నీటి కలశాలతో భారీగా ఊరేగింపు జరిపించబోతున్నామని కాబట్టి పంచాయతీ ప్రజలంతా పాల్గొని, ఆ శ్రీరామచంద్రుని భక్తిలో తరించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరారు. యువనాయకులు ఎద్దు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలంతా తమ ఆర్ధిక, హార్దిక, శ్రమ, వస్తు సామగ్రి సహకారాలతోనే ఈ ఆలయం ప్రతిష్టకు సిద్ధమైందని తెల్పుతూ రామరాజుతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు శ్రీరామ భక్తి గీతాలనాలపించారు. స్థానిక పెద్దలు విశ్రాంత వీఆర్వో  బలగ అప్పారావునాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, వంజరవిల్లి చంద్రశేఖరరావు, గుడ్ల పవన్ కుమార్, పతివాడ శేఖరరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కామెంట్‌లు