సరస్వతీ నమస్తుభ్యం.:- ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్,-భైంసా,నిర్మల్ జిల్లా ,సెల్ నెం 9441333315

 ]సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
అంటూ సరస్వతీ దేవిని కొలచిన భక్తులకు కొంగుబంగారమై నిలుస్తున్న సరస్వతి దేవి ఆలయాలు మన దేశములో రెండు ఉన్నాయి.
ఒకటి కాశ్మీర్లో
రెండవది బాసరలో
   తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన సరస్వతీమాత సన్నిధిలో చిన్నారులకు వ్యాసం చేస్తే పిల్లలు విద్య వంతులవుతారని భక్తులు నమ్ముతారు.
అమ్మవారిని దర్శించుకొని
శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ
వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే!
అంటూ భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. త్రి కరుణ శుద్ధిగా మొక్కిన వారికి అమ్మవారు వాక్ శుద్ధి, జ్ఞాన సిద్ధి, మేధా సిద్ధి, మంత్రసిద్ధి, ధారణ సిద్ధి, కామ్యసిద్ధులను అందిస్తుందని భక్తులు మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఇటువంటి మహిమానిత్వమైన సరస్వతి అమ్మవారిని వేద వ్యాస మహర్షి ప్రతిష్టించారు.
   వేద వ్యాసుడు మనశ్శాంతి కోసం తన శిష్య గణముతో కలిసి తపస్సు చేయుటకు అణువైన ప్రదేశం కోసం మన భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల దర్శన యాత్ర చేపట్టారు. ఈ క్రమములోనే దక్షిణ భారతదేశంలోని దండకరణ్యం చేరుకున్నారు. కుమారస్వామి తపస్సు చేసిన పర్వత గుహ వద్దకు చేరుకున్నారు. ఈ పర్వతము గోదావరి నది తీరాన ఉంది. దీనితో తమ తపస్సుకు అనువైన స్థలం ఇదేనని ఎన్నుకున్నారు. తపస్సు చేశారు. వ్యాస మహర్షి తపస్సుకు సరస్వతీ దేవి ప్రసన్నురాలయింది. నా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించి , పూజించుమని చెప్పిందట. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం వేద వ్యాసుడు గోదావరి నదిలో స్నానము చేసి, చదువుల తల్లి సరస్వతిని మనసారా ధ్యానించి, మూడు పిడికిళ్ల ఇసుకను తీసుకొని వచ్చి మూడు మూర్తులను తయారుచేసి  ప్రతిష్టించారు. ఒకటి సరస్వతి దేవి, రెండు మహా లక్ష్మి ,మూడు మహాకాళి.
ద్వాపర యుగంలో వేద వ్యాస మహర్షి చేతుల మీదుగా ప్రతిష్టించిన ఈ అమ్మవారి దేవాలయానికి 14వ శతాబ్దంలో మక్కాజి పటేల్ అనే భక్తుడు 1394 పునరుద్ధరణ చేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ద్వాపర యుగాంతం నుంచి నేటికు  సరస్వతి దేవిని దర్శించుకొనుటకు ఎందరో మంది భక్తులు వస్తున్నారు. నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఈ క్షేత్రం మహిమానిత్వంగా విరజిల్లుతున్నది.
ఈ పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా మూడు పర్వదినాలు నిర్వహిస్తారు. ఒకటి దేవి శరన్నవరాత్రి. రెండవది శివరాత్రి. మూడవది వసంత పంచమి. వసంత పంచమి నాడు ఎందరో మంది భక్తులు తమ చిన్నారులకు అక్షరభ్యాసం చేయటానికి వస్తారు. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కావున జ్ఞాన సరస్వతి అని పేరు పొందింది. బాసర్ గా ఉన్న ఈ ఊరు వ్యాస మహర్షి రావడం వలన వ్యాసపురిగా మారింది. అమ్మవారికి సమీపాన వ్యాస మహర్షి మందిరము కలదు. అమ్మవారి సన్నిధిలో దత్తాత్రేయ మందిరము కలదు. అమ్మవారికి నిత్య పూజలు, హోమాధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటాయి. నిత్యం వేదాల పారాయణం జరుగుతుంది భక్తుల సౌకర్యార్థం బస్సు, ధూమ శకట వాహనం అందుబాటులో ఉంది.

కామెంట్‌లు