కవితలలో...: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆవంతయినా
ఆకర్షణ ఉండాలి
రవంతయినా
రమ్యత ఉండాలి

పిసరంతయినా
పటిమ ఉండాలి
పిడికడంతయిన
ప్రతిభ ఉండాలి

ఇసుమంతయినా
ఇంపు ఉండాలి
కొంతగానయినా
కొత్తదనం ఉండాలి

కాసింతయినా
కమ్మదనం ఉండాలి
చిటికడంతయినా
చమత్కారం ఉండాలి

బుల్లంతయిన
విషయంలో బలముండాలి
లవమంతయినా
భావంలో బరువుండాలి

కీసంతయినా
అక్షరాలకూర్పులోబాగు ఉండాలి
మినుకంతయినా
పదాలపేర్పులోనేర్పు ఉండాలి

అల్పంగానయినా
ఆలోచింపచేసేలా ఉండాలి
స్వల్పంగానయినా
సరదాకొలిపేలా ఉండాలి

తక్కువుగానయినా
తృప్తిపరిచేలా ఉండాలి
తిబిరింతయినా
తట్టిలేపేలా ఉండాలి

కొలదిగానయినా
కల్పితాలు ఉండాలి
కొద్దిగానయినా
కైపిచ్చేలా ఉండాలి

ఇంచుకయినా
ఇంగితం ఉండాలి
నలుసంతయిన
నాణ్యత ఉండాలి

ఒక్కింతయినా
తీయదనం ఉండాలి
గోరంతయినా
గొప్పదనం ఉండాలి

పల్లెత్తయినా
పకపకలాడించాలి
కించెత్తయినా
కితకితపరచాలి

అన్నీకలిపి
అద్భుతంగా తీర్చిదిద్దాడనుకోవాలి కవిని
అంతాసంతసిల్లి
అంతరంగాన నిలుపుకోవాలి కవితని

అందరూచదివి
ఆనందపరవశులు కావాలి కవితకి
అంతాస్పందించి
అభినందనలు అందించాలి కవికి


కామెంట్‌లు