లింగోద్భవ ప్రాశస్థ్యం;-సి.హెచ్.ప్రతాప్
 శివ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడిన ఒక కధ ప్రకారం ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తి చివరకు అది యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు.అయితే ఆ మహాగ్ని స్థంభం నుండి వెలువడే అగ్ని జ్వాలలు ఈ సృష్టినే దగ్ధం చేసే విధంగా వుండడంతో వెంటనే అపరిమితంగా  మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి మహాగ్నిస్తంభాన్నిచల్లార్చాడు. ఆ మహాగ్ని స్థంభమే  శివలింగం అని పురాణ కధనం. మాఘ బహుళ చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో ఇది  జరిగింది. కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు ఆ లింగం యొక్క ఆది అంత్యాలను తెలుపమని పరమేశ్వరుడ్నే వారిద్దరూ శరణు వేడుకొంటారు.
అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహించడం ఒక సాంప్రదాయం. ఈ సమయంలో లింగం దర్శనం, స్వామి వారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ సమయంలో స్వామి వారిని బిల్వ పత్రాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని శాస్త్ర వచనం. ఈ లింగోధ్భవ ఘట్టాని తిలకించించి అపారమైన పుణ్యం సొంతం చేసుకునేందుకే శివరాత్రి నాడు జాగరణ, నిద్ర రాకుండా ఉండేందుకు ఉపవాసం వంటి నియమాలను మన పెద్దలు పెట్టారు.  భక్తవ శంకరుడు, భోళా శంకరుడు అయిన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి అంటే శివయ్యకు, శివయ్య భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ దీక్షలతో, రోజంతా శివనామస్మరణతో గడుపుతారు.శివరాత్రి రోజున శివునికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెబుతారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్థరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివ బిల్వార్చన, అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు విశేషంగా నమ్ముతారు.
లింగోద్భవ విగ్రహం పొడవైన, స్తంభం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, ఇది లింగం, దీనిలో 4 చేతుల శివుడిని చూడవచ్చు.లింగం చుట్టూ, పైకి ఎగురుతున్న ఒక హంస ఉంది. అది బ్రహ్మను సూచిస్తుంది. దిగువన, విష్ణువును సూచించే ఒక పంది లింగం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి భూమిని తవ్వుతోంది. లింగోద్భవ రూపం సాధారణంగా శివాలయాల ప్రధాన మందిరం పశ్చిమ గోడపై కనిపిస్తుంది.
 

కామెంట్‌లు