అతి గారాబం శ్రుతి మించితే : సరికొండ శ్రీనివాసరాజు
  సుబ్బయ్యకు రామయ్య, సోమయ్య అనే ఇద్దరు కొడుకులు. రామయ్య చాలా తెలివి తేటలు గలవాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. సోమయ్య అల్లర చిల్లర సావాసాలతో చెడు ప్రవర్తన అలవరచుకొని, చదువులో పూర్తిగా మందమతి అయ్యాడు. చిన్నప్పటి నుంచీ తండ్రి గారాబం ఎక్కువై సోమరిగా తయారు అయ్యాడు. 
      సుబ్బయ్య తన కొడుకు రామయ్య బాగా చదువుతున్నా, తండ్రి చెప్పిన మాటలు వింటున్నా, రామయ్యను చూసి ఓర్వలేక పోయాడు. వివక్ష కారణం. రామయ్యతో కావాలని జగడం వేసుకొని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. జన్మలో తనకు ముఖం చూపించవద్దని అన్నాడు. రామయ్య నిజాయితీగా పని చేస్తూ మంచితనంతో అందరి మన్ననలను పొందాడు. రామయ్య మంచితనాన్ని చూసిన వీరయ్య అనే ధనవంతుడు తన కూతురు అయిన వైదేహిని ఇచ్చి పెళ్ళి చేసాడు.ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు.
     సోమయ్యకే తండ్రి తన ఆస్తిని అంతా రాసి ఇచ్చాడు. సోమయ్య చెడు వ్యసనాలకు బానిస అయ్యి, తల్లిదండ్రులతో తరచూ గొడవ పడి, చివరకు వాళ్ళని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. సోమయ్య పిల్లలు కూడా తండ్రి బాటలో నడుస్తూ చదువు సంధ్యలు లేక పూర్తిగా అడ్డదారి పట్టారు. 
     రామయ్య, వైదేహి ఇద్దరూ తమ పిల్లలకు నిత్యం నీతి కథలు బోధిస్తూ, మంచి మార్గాన పెంచారు. వారు చదువు సంధ్యలలో కూడా ఉన్నతంగా దూసుకుపోతున్నారు. వారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. తండ్రి అతి గారాబం వల్ల సోమయ్య ఆ తర్వాత వాళ్ళ వారసుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఆ అతి గారాబం వాళ్ళకు కూడా పెను శాపం అయింది.

కామెంట్‌లు