కాకుల గొప్పతనం:- - యామిజాల జగదీశ్

అదొక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఓ కాకి జంట తమ పిల్లలతో నివసిస్తున్నాయి.
అక్కడికి దగ్గర్లోనే ఉన్న నగరానికి వెళ్ళి అక్కడ లభించే ఆహారాన్ని తిని సాయంత్రానికి గూటికి చేరుకునేవి. గూచిలోని తమ పిల్లలకు అన్నం పెట్టేవి.
అటూ ఇటూ చెట్లపై ఉంటున్న ఇతర పక్షులు కాకుల బతుకులను చూసి మనుషులు మిగిల్చిన లేదా పారేసిన అన్నం మెతుకులను తింటూ జీవిస్తున్నారని కాకులను ఎగతాళి చేసి నవ్వుకునేవి. కానీ కాకులు ఈ మాటలను పట్టించుకోకుండా తమ జీవితం సాగిస్తున్నాయి. తమలాగా అడవికి వెళ్ళి మాలాగా దర్జాగా బతకలేని మిమ్మల్ని చూస్తుంటే మాకు సిగ్గేస్తోంది అని ఆ పక్షులంటుండేవి.
ఎప్పుడు చూసినా ఇతర పక్షలు తమ గురించి ఏదో ఒకటి అనడంతో మగకాకి ఇక లాబం లేదనుకుని ఓరోజు నోరు విప్పింది. మేము నగరానికి వెళ్ళి అక్కడి అన్నం మెతుకులను ఏరుకు తినడం వల్లే ఆ నప్రాంతమంతా పరిశుభ్రమవుతోంది, మేమంటే నగరవాసులకు ఎంతో ఇష్టమని, మేము కష్టించే జీవిస్తున్నామని, తింటున్నామని చెప్పింది. అంతెందుకు కొందరు తమను మరీ పిలిచి అన్నం పెడతారని గొప్పగా చెప్పింది.
అయినప్పటికీ నెమలి, పావురం. పిచ్చుక వంటివి కాకులను ఎగతాళి చేయడం మానలేదు. మీరందరూ నల్లగా ఉండటం వల్ల మనుషులు మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నారన్నది మీరెప్పుడు తెలుసుకుంటారో తెలీడం లేదు. మిమ్మల్ని చూస్తుంటే మాకు సిగ్గేస్తోంది అన్నాయి. అంతేకాదు, మీరు మాంసాహారులు. మా పక్కపక్కనే మీరు నివసింటడం మాకు ఇబ్బందిగా అసహ్యంగా ఉందన్నాయి.
ఈ మాటలు విన్న కాకి పిల్లలు ఎంతో బాధపడ్డాయి. తమ బాధను తమ తల్లిదండ్రులతో చెప్పాయి. అప్పుడు మగకాకి తన పిల్లలను చూసి, ఇతరుల మాటలన్నీ చెవికెక్కింటుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే క్కడే కాదు కదా ఎక్కడా బతకలేం...అనేవాళ్ళు ఏదో ఒకటి అంటారు. వారికి పనేముంది...ఎక్కడికెళ్ళినా దో ఒక సమస్య ఉంటుంది....మనం ప్రతి దానిని భూతద్దంతో చూడకూడదంది. అవసరమైన మాటలను మాత్రమే చెవికెక్కించుకోవాలి. అంతేతప్ప అక్కర్లేని మాటలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మరచిపోవాలి అన్నాది. మన వాలకం ఇతరులకు అర్థమైనప్పుడు మనమెంత సరైనవారమో బోధపడుతుందిలే అని చెప్పింది.
కొంతకాలానికి నెమళ్ళు తమలో తాము బాధపడ్డాయి. వారి మాటలు బట్టి అవి బాధ పడుతున్న విషయాన్ని గ్రహించింది మగకాకి. తన ఆడకాకితో కలిసి నెమళ్ళ దగ్గరకు వెళ్ళి ఎందుకు బాధపడుతున్నారని అడిగింది మగకాకి.
అప్పుడు నెమళ్ళు తామిక్కడికి సమీపంలో ఉన్న ఓ పంటపొలంలో ధాన్యం గింజలు తినడానికి వెళ్తుండడం గమనించిన రైతు మమ్మల్ని అంతమొందించడానికి అక్కడక్కడా క్రిమసంహారక మందులు చల్లుతున్నాడు. దాంతో మేము అటువైపు వెళ్ళలేకపోతున్నామని, అంతేకాకుండా మమ్మల్ని పట్టుకోవడానికి వల పన్నుతున్నారని చెప్పాయి.
అయితే కాకిజంట బాధపడకండి...మిమ్మల్ని రక్షించే బాధ్యత మాది...మేము మీకున్నాం. మమ్మల్ని నమ్మండి...అంది.
అయితే నెమళ్ళకు నమ్మకం లేదు. మీరు మమ్మల్ని కాపాడుతారా, అదెట్లాగూ అని డిగాయి నెమళ్ళు.
మరుసటి రోజు ఓ అయిదారుగురు వ్యక్తులు నెమళ్ళు ఉంటున్న చెట్టు దగ్గరకు వచ్చి వాటిని ఎలా పట్టాలా అని మంతనాలు చేస్తున్నారు.
వాళ్ళట్లా మాట్లాడుకుంటున్నారో లేదో కాకి జంట ఓ వంద కాకులతో ఆ మనుషులపై దాడి చేశాయి. ఒక్కసారిగా అన్ని కాకులు తమ మీదకు దూసుకురావడంతో ఆ అయిదారుగురు ఆందోళన చెందారు. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి కాళ్ళకు బుద్ధి చెప్పారు. నెమళ్ళు అమ్మయ్య అనుకున్నాయి. తమకొచ్చిన గండం కాకుల వల్ల తప్పిందని ఊపిరి పీల్చుకున్నాయి. కాకులకు కృతజ్ఞతలు చెప్పాయి. మీరు మా చెట్టు పక్కనే ఉండటం మేము సురక్షితంగా ఉండగలుగుతున్నామని చెప్పాయి. మీరుండటం వల్ల ఇక మనుషులు ఇక్కడికి రారన్నాయి. అంతేకాదు, నెమళ్ళు కాకిజంటను చూసి మీకు ఇంతమంది మిత్రులున్నారా అని ఆశ్చర్యంగా అడిగాయి.
అప్పుడు మగకాకి నవ్వుతూ చెప్పింది ...
బతకడం కోసం మనుషులుండే చోటుకి వెళ్ళినా మేమెప్పుడూ సఖ్యంగానే ఉంటాం. ఒకరికి ఏదన్నా ప్రమాదం అంటే మిగిలినవన్నీ సాయానికి వస్తాయి అని.
ఆ మాటలకు నెమళ్ళు తాము కూడా ఇక మీదట మీలాగానే ఉంటామన్నాయి.
రోజులు గడిచాయి.
ఓరోజు పిచ్చుకలు కీచుకీచుమని అరుస్తూ అటూ ఇటూ ఎగురుతున్నాయి. అప్పుడు మగకాకి తమ గూటిలోంచి బయటకు తొంగి చూసింది. అప్పుడు ఓ పాము పిచ్చుక గూటికేసి పాకుతూ పోతోంది నెమ్మదిగా. వెటంనే మగకాకి మరికొన్న కాకులతో కలిసి పాము మీద దాడికి దిగాయి. ఇంకేముంది, పాము మరోదారి లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది, అనంతరం పిచ్చుకలు తమ గూటికి చేరడంతోపాటు కాకికి కృతజ్ఞతలు చెప్పాయి.
ఇలా ఉండగా, ఓ రోజు నెమళ్ళు కాకులను చూసి అడిగాయి...
మనుషులు మిమ్మల్ని ఎలా పిలిచి అన్నం పెడతారు అని.
ఆ ప్రశ్నకు మగకాకి, మేము తింటే తమ పూర్వీకులు తింటున్నారని భావిస్తారు. అందుకే చేతులెత్తి మాకు కృతజ్ఞతలు చెప్తారు అంది.
ఈ మాటతో మిగిలిన పక్షులన్నీ కాకుల గొప్పతనాన్ని గ్రహించి ఆరోజు నుంచి వాటిని పల్లెత్తు మాట అనకుండా స్నేహంతో మెలిగాయి.
నీతి – ఒకరి రూపం ఎలా ఉందన్నది ముఖ్యం కాదు. వారి గుణగణాలు, మాటలూ, చేతలూ ముఖ్యం.
మనం మంచిగా ఉంటే మనతో అందరూ మంచిగా ఉంటారు.
 

కామెంట్‌లు