సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-860
"ఉదకమ్ పరమౌషధమ్" న్యాయము
*****
ఉదకము అనగా నీరు, జలము.పరమ అనగా దూరతమము,అంతిమము,ఉచ్చతమము,సర్వోత్తమము,ముఖ్యము,పర్యాప్తము,సర్వోత్కృష్టము.ఔషధము అనగా  మందు అని అర్థము.
నీరే అన్నింటి కన్నా మంచి మందు అని అర్థము.
ప్రకృతి ప్రసాదించిన వరం నీరు.ప్రకృతిలోని సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. మొట్టమొదట జీవి పుట్టుక నీటిలోనే జరిగిందని మనందరికీ తెలిసిందే.
మంచి నీరు మనిషికి మంచి ఔషధము అని ఎందుకు అంటారో తెలుసుకుందాం.ఎందుకంటే నీరు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.నీటి వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని జీవక్రియలకు నీరు అవసరం.అందుకే మన పెద్దవాళ్ళు, వైద్యులు పొద్దున్నే లేవగానే దినచర్య నీళ్ళతో మొదలు పెట్టమని,జీవన విధానంలో తప్పని సరిగా ఒక భాగం చేసుకోవాలని అంటుంటారు.
అంతే కాదు ఈ భూమి మీద మూడు వంతులు నీరు ఎలా ఉంటుందో మన శరీరంలో కూడా మూడొంతుల నీరు ఉంటుందని, ఉండాలని అంటారు.
 ఇంకా మన శరీరానికి నీరు ఎలాంటి మేలు చేస్తుందో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూద్దాం.
శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చెమట రూపంలో బయటకు పంపేందుకు నీరు ఉపయోగ పడుతుంది. జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేలా  శరీరానికి తగిన పోషకాలను అందేలా చేస్తుంది.
శరీరంలోని వ్యర్థాలను మూత్రపిండాల ద్వారా బయటకు పంపేందుకు నీరు తప్పని సరిగా తాగాలి.కీళ్ళ కదలికకు కందెన వలె పనిచేస్తుంది.దేహంలోని కణాలకు అవసరమయ్యే పోషకాలు అందించి అవి సజీవంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఇన్ని రకాల మేలు చేస్తుంది కాబట్టే నీటిని పరమౌషధమ్ అన్నారు.అలాగే నీరు ఉన్న చోటనే మానవుడు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడని, మానవ నాగరికత అలాంటి  చోట్లలోనే వర్థిల్లిందని మనకు తెలుసు.
అందుకే సుమతీ శతక కర్త  ఇలా అంటాడు."అప్పిచ్చువాడు వాడు, వైద్యుడు/ ఎప్పుడు నెడతెగక పారు నేరును,ద్విజుడున్/ చొప్పడిన,యూరనుండుము/ చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ! అన్నాడు".
అనగా అవసరమైనప్పుడు జాలి, దయతో అప్పు ఇచ్చే వాడు, అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం చేసే వైద్యుడు, మంచి చెడులు చెప్పే విద్యావంతుడైన బ్రహ్మణుడు. ఎల్లప్పుడూ నిరంతరం పారే ఏరూ  ఉన్న ఊరిలో ఉండాలి.వీరు లేని ఊరిలో ఉండవద్దు అన్నాడు.
మనిషి గాలి లేకుండా కొన్ని నిమిషాల్లో(3 నిమిషాలు) మరణిస్తాడు. నీరు లేకుండా 2,3 రోజుల కంటే మహా అయితే మరో రెండు రోజులు బతుకుతాడేమో.ఇక ఆహారం లేకుండా వారం నుండి మూడు వారాల వరకు బతకొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
 కాబట్టి మనిషి బతికేందుకు, ఆరోగ్యంగా జీవించడానికి నీరు చాలా అవసరం అని మనం ఈ "ఉదకమ్ పరమౌషధమ్ న్యాయము" ద్వారా తెలుసుకున్నాం.

మరి ఈ న్యాయమును కేవలం నీటి ఉపయోగం గురించి మాత్రమే కాకుండా మన పెద్దలు మనిషి యొక్క మనస్తత్వంతో పోల్చి చెప్పడం విశేషం.అదెలా అంటే స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండనట్లే స్వచ్ఛమైన మనసున్న మంచి వారికి ఎలాంటి తమ పర, పేదా గొప్ప భేదాలు ఉండవనీ,మనిషికి మంచి నీరు ఎలా ఉపయోగ పడుతుందో మంచి మనిషి కూడా అలాగే ఉపయోగపడతాడని చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థము.
మరి మనము కూడా ఎలాంటి విషయ వాసనలు లేకుండా స్వచ్ఛమైన మంచి నీటి/ మంచి మనిషిగా జీవిద్దాం.

కామెంట్‌లు