అదీ అతని ప్రజ్ఞ!!:- - యామిజాల జగదీశ్
 ఒక యంత్రాన్ని సరి చేయడానికి ఒకానొక ఇంజినీరు 10,000 డాలర్లు వసూలు చేసిన ఇంజనీర్ గురించి తెలిసే ఉంటుంది. కానీ అతని తెలివితేటలు గురించి మరొక్కసారి చెప్పాలనిపించింది. అతని ప్రజ్ఞంతా స్క్రూని ఫిట్ చేయడంలోనే ఉంది.
స్క్రూను ఎక్కడ అమర్చాలన్న దానికి ఒకే ఒక్క డాలరు తీసుకున్న అతను మిగిలిన 9,999 డాలర్లూ ఏ సైజ్ స్క్రూ వాడాలో చెప్పినందుకు ఛార్జ్ చేసినట్లు ఆ మనిషి స్వయంగా చెప్పుకున్నాడు. అతనికి ముందు కొందరిని ఆ యంత్రాన్ని బాగు చేయడానికి పిలిచినా ఎవరూ సరి చెయ్యలేక పోయారట. అప్పుడు ఈ ఇంజినీరుని పిలిపిస్తే అతను విజయవంతమయ్యాడు.
ఇది కేవలం ఒక కథ కాదు. నిజం. ఆ ఇంజనీర్ నిజమైనవాడు. అతని పేరు చార్లెస్ ప్రోటీయస్ స్టెయిన్మెట్జ్ (1865–1923). ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తెలివైన ప్రతిభ గలవాడు.
ఒక రోజు, హెన్రీ ఫోర్డ్ రివర్ రూజ్ ప్లాంట్‌లో, ఒక భారీ జనరేటర్ చెడిపోయింది. కానీ ఫోర్డ్ సొంత ఇంజనీర్లలో ఎవరూ సమస్యను గుర్తించలేకపోయారు. కాబట్టి, ఫోర్డ్ స్టెయిన్మెట్జ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
స్టెయిన్మెట్జ్‌ వచ్చీరావడంతోనే, మూడు విషయాలు మాత్రమే అడిగాడు. అవి, నోట్‌బుక్, పెన్సిల్, ఒక మంచం.
అతను రెండు పగళ్ళూ  రాత్రులూ యంత్రానికి సమీపంలో మంచం వేసుకుని అది పని చేస్తున్న తీరుని వింటూ, నోట్ బుక్కులో  రాసుకున్నాడు. ఈ క్రమంలో ఓ నిర్ణయానికి వచ్చిన స్టెయిన్మెట్జ్‌
చివరకు, నిచ్చెన, టేప్ కొలత, సుద్ద ముక్క అడిగి తీసుకున్నాడు. అతను జనరేటర్ పైకి ఎక్కి, కొన్ని కొలతలు తీసుకుని, ఒక ప్రదేశాన్ని ఎక్స్ (X) మార్క్ గీసాడు. 
ఫోర్డు ఇంజనీర్ల వైపు తిరిగి స్టెయిన్మెట్జ్‌
ఇలా అన్నాడు...
"ఈ ప్యానెల్‌ను తీసివేసి, కాయిల్‌ను ఇక్కడే సరిగ్గా విప్పి, 16 మలుపుల వైర్‌ను తీయండి."
వారు ఆ ఇంజినీర్ చెప్పినట్లే చేసారు. జనరేటర్ తిరిగి ప్రాణం పోసుకుని మునుపులా సవ్యంగా పని చేసింది. అనంతరం అతను వెళ్ళిపోయాడు. 
కొన్ని రోజులకి హెన్రీ ఫోర్డుకి స్టెయిన్‌మెట్జ్ నుంచి ఓ బిల్లు అందింది. ఎంతకనుక్కున్నారు...ఏకంగా పది వేల డాలర్లు.
ఆ మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఫోర్డు ఎందుకింత అయ్యిందో విడివిడిగా బిల్లు రాసివ్వమన్నాడు. దానికేం అని చెప్పిన స్టెయిన్‌మెట్జ్ 
"సుద్దముక్కతో ఎక్స్ మార్క్ గీసిన దానికి ఒక డాలరు, గుర్తించిన చోట ఏ రకపు సైజ్ స్క్రూ బిగించాలో అన్న దానికి మిగిలిన 9,999 డాలర్లు" అని
చెప్పి ఆ మేరకు బిల్లు రాసిచ్చాడు. అంతా ఆ స్క్రూ బిగించడంలోనే ఉందన్నాడు స్టెయిన్మెట్జ్‌.
దాంతో మరో ఆలోచన లేకుండా, ఫోర్డు బిల్లు మొత్తాన్ని చెల్లించాడు.
ఈ విషయాన్నంతా తరువాతి రోజుల్లో అనగా 1965లో ఫోర్డు ఉద్యోగి కుమారుడు జాక్ బి. స్కాట్ "లైఫ్" మ్యాగజైన్‌లో వివరిస్తూ ఓ వ్యాసం రాయడం గమనార్హం.
స్టెయిన్‌మెట్జ్ పొట్టివాడే. కానీ గట్టివాడు. అతని ఎత్తు కేవలం 4 అడుగుల పొడవు. వీపు కాస్తంత వంగి ఉండేది. సవ్యంగా నడిచేవాడు కాదు.  కానీ అతని అసాధారణ ప్రతిభ గల వ్యక్తి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్‌లకు స్నేహితుడే ఈ 
స్టెయిన్మెట్జ్‌!

కామెంట్‌లు