'పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి': - ఈర్ల సమ్మయ్య
 -తల్లిదండ్రులు డబ్బులు వృధా చేసుకోవద్దని సూచన
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (స్వయం అభ్యసన కేంద్రం)లో శుక్రవారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పిటిఎం) ఈర్ల సమ్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులను కోరారు. పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువతీ, యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు ప్రైవేటు విద్యపట్ల మోజు విడనాడాలని, ప్రైవేట్ పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలే టాపర్లుగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. కొందరు తల్లిదండ్రులు తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఫీజుల పేరిట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి ధారాదత్తం చేస్తున్నారని, ప్రతి పైసా ఎంతో విలువైందని, డబ్బులు ఊరికే రావని ఆయన అన్నారు. ఫీజుల రూపంలో చెల్లించే వేలాది రూపాయల డబ్బును పిల్లల పేరు మీద బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసుకోవాలని ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులకు కోరారు. చదువులో, సౌకర్యాల్లో ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగ్గా ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరారు. ఊషన్నపల్లి పాఠశాల పిల్లలు అన్ని అంశాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారని, పాఠశాలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా "బెస్ట్ స్కూల్ అవార్డు", జిల్లా విద్యాశాఖాధికారి చేతులమీదుగా "చాంపియన్ స్కూల్ అవార్డు" అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో యూకేజి నుంచి ఐదవ తరగతి వరకు పిల్లలకు హిందీ భాషను నేర్పిస్తామని, కంప్యూటర్ ఆధారిత విద్య ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమలో హెచ్.ఎం ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువతీ, యువకులు, పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు