గాయం!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
గాలిని గాలించే చీకటి నిశ్శబ్దంతో యుద్ధం చేస్తోంది. 
క్షుద్ర విద్యల్లో బంధించే భయంకర స్వరం మంత్రించినట్లు 
మాంత్రికులంతా నిశ్శబ్ద యంత్రాలైనారు. 

మృత్యువు మత్తులో మునిగి నీటిలో ఈదుతుంది 
ఎర్రని రక్తం కక్కిన శవం మంత్రసాని కోసం వెతుకుతుంది 

తోకచుక్కల్లా రాలిపోతున్న నక్షత్రాలు పశ్చాత్తాపంతో రగిలిపోతున్నాయి. 
విరిగిన కసి కాలం చేసింది. 

కళ్ళు పీకి ఆకాశానికి అతికిస్తున్న రాత్రిని సూర్యుడు తొంగి చూస్తున్నాడు. 
మళ్లీ మళ్లీ పిలిచే పిలుపులు చెవులను హత్య చేసి శరీరాలకు వేలాడదీస్తున్నవీ.

పూజల కోసం సిద్ధం చేస్తున్న నరాల దారంలో పూలు గిలగిలా లాడుతున్నవి. 
వెక్కిరించిన ఉరి తాళ్లు తూటాల పైన నాట్యం చేస్తూ మరణాన్ని బ్రతికిస్తున్నవీ.

భూమిని పగలగొట్టి మంటల్లో  కాల్చేసి నట్లు శవం ఒకటి శంఖం పూరించింది. 
ప్రపంచం మంచం పట్టి కొంచెం కొంచెం కోలుకుంటుంది. 
దానికి దిగులు ఔషధం అంగల్లలో దొరకట్లేదు అంగాలలో దాక్కుంది.

దరిద్రం అంతా దాహం లోనే ఉంది దేహంలోనే ఉంది. 
దేశాలన్నీ దేహాల్ని కోల్పోతున్నాయి. ప్రాణాలన్నీ గాల్లో తేలిపోతున్నవీ.
గాయపడ్డది ,ఇప్పుడు -గాలి .భూమి కాదు.!!?

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు