పిసినారి - టెంకాయ - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒకడుండేటోడు. వాడు పెద్ద పిసినారి. పదిపైసలు ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచించేటోడు. వానికో రోజు పెద్ద జ్వరమొచ్చింది. ఎంతమంది వైద్యులకు చూపిచ్చినా, ఎన్ని మందులు మింగినా కొంచం గూడా తగ్గలేదు. దాంతో ఒకరోజు దేవుని గుడికి పోయి “సామీ! సామీ! నాకు జ్వరం గనుక తగ్గిపోతే నీకు ఒక టెంకాయ కొడతాను. ఎట్లాగయినా తగ్గించు సామీ" అని వేడుకున్నాడు. కొద్దిరోజులకు వైద్యులిచ్చిన మందులు బాగా పని చేసి జ్వరం తగ్గిపోయింది.
జ్వరం తగ్గితే దేవునికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు గదా! దాంతో ఒక రోజు టెంకాయలంగడికి పోయి “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు "నాలుగు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా... వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని “మూడుకియ్యవా " అన్నాడు. ఆ మాటలకు వాడు "మూడు రూపాయలకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న తాండ్రపాడుకు పో, ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి తాండ్రపాడులో టెంకాయలంగడికి చేరుకోని "ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “మూడు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా. వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని "రెండుకియ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు “రెండు రూపాయలకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న నన్నూరుకుపో ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా మరో పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి నన్నూరులో టెంకాయలంగడికి చేరుకోని “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “రెండు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడుగదా... వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని "రూపాయకియ్యవా " అన్నాడు. ఆ మాటలకు వాడు "రూపాయకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న ఓర్వకల్లుకు పో. ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్ళు కిందామీదాపడి నదిచి ఓర్వకల్లులో టెంకాయలంగడికి చేరుకోని “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “ఒక రూపాయ" అన్నాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా... రూపాయ గూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేక "వూరికే ఇయ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు “వూరికే ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న కాల్వబుగ్గకు పో ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా ఇంకో పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి కాల్వబుగ్గలో టెంకాయల తోటకి చేరుకోని “ఒక టెంకాయెంత" అన్నాడు. వాడు "డబ్బులేమీ వద్దులే పూరికే తీసుకో" అన్నాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా ఇచ్చిందాన్ని పుచ్చుకోని సంతోషంగా తీసుకోని పోక "వూరికే రెండియ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు చూపించి “రెండేం ఖర్మ నీకెన్ని కావాలంటే అన్ని నువ్వే కోసుకో పో" అన్నాడు.
దాంతో వానికి ఆశ పుట్టి గబగబా టెంకాయచెట్టు దగ్గరికి పోయినాడు. అది ఒక పెద్ద బావి పక్కనే వుంది. నెమ్మదిగా చెట్టు ఎక్కసాగినాడు. టెంకాయ చెట్టు బాగా పొడుగ్గా, కొమ్మలు రెమ్మలు లేకుండా సక్కగా, నున్నగా వుంటాది గదా. దాంతో వాడు కొంచం దూరం ఎక్కి పట్టు తప్పి సర్రున జారి దభీమని బాయిలో పడినాడు. ఆ బాయికి మెట్లుగూడా లేవు. దాంతో వాడు లబోదిబోమని అరుస్తా వుంటే టెంకాయలోడు వచ్చి గమ్మున చూస్తా కూచున్నాడు.
వాడు వాన్ని చూసి “బాబూ! బాబూ! నన్ను కాపాడవా" అనరిచినాడు.
దానికి వాడు చిరునవ్వు నవ్వి “టెంకాయలయితే వూరికే ఇస్తాగానీ... ఎవరినీ ఊరికే కాపాడను. వందరూపాయలు ఇచ్చేటట్టయితే చెప్పు కాపాడుతా" అన్నాడు. వాడు చేసేదేమీ లేక ఆఖరికి "సరే" అన్నాడు. దాంతో వాడు తాడేసి వాన్ని పైకి లాగి వందరూపాయలు తీసుకున్నాడు.
రూపాయకు చూసుకుంటే ఆఖరికి వందరూపాయలు పోయిందే అని బాధపడతా వాడు మళ్ళా నడుచుకుంటా ఉత్త చేతులతో ఇంటికి చేరుకున్నాడు.
***********
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం