నేడు తెలుగు బాల సాహిత్యం చాలా విస్తృతంగా రాశిలోనూ వాసిలోనూ పెరిగింది . ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అనేకమంది బాల సాహిత్య రచయితలతో పాటు విద్యార్థులు కూడా అనేక ప్రక్రియలలో బాల సాహిత్యాన్ని రాస్తున్నారు. రాశిలో పెరిగినప్పటికీ వాసిలో అనుకున్నంతగా నాణ్యత లేదనే విమర్శ కూడా ఉంది.అయితే బాలసాహిత్య వికాసోద్యమంలో నికార్సయిన తత్వంతో అచ్చంగా పనిచేసిన వ్యక్తులు చాలా కొద్ది మందే మనకు కన్పిస్తారు.అటువంటి వారి సాహిత్యమే నిలబడిందని చెప్పవచ్చును.అట్లా దాదాపు దశాబ్దమున్నర క్రితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే బాల సాహిత్యంలో బడి బాష కు బదులు ఇంటి భాషకు పట్టం కట్టి తెలంగాణ మాండలిక పదాలతో బాలల కోసం అనేక కథలు రాసిన వారిలో పెండెం జగదీశ్వర్ ముందు వరుసలో వుంటారు. చాలా కాలం పాటు ఇంటి భాషలో కథలు రాస్తూ నూతన ఒరవడి సృష్టించారు.పెండెం జగదీశ్వర్ వినోదం కోసమో, అవార్డుల కోసమో రచనా రంగంలోకి అడుగు పెట్టలేదు. వర్తమాన విషయాలపై స్పందిస్తూ నిత్యం చైతన్యం కావించన అక్షరయోగి. ఆయన పిల్లల మనసును గెలిచిన బాల సాహితీవేత్త. జగదీశ్వర్ వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ప్రవృత్తి రీత్యా కార్టూనిస్టు గా, బాలల రచయితగా పనిచేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక బాల సాహిత్య కార్యశాలలో పాల్గొని ఎన్నో సృజనాత్మక రచనలు చేశారు.అయన ఉమ్మడి నల్లగొండ( ప్రస్తుతం యాదాద్రి భువనగిరి )జిల్లాలోని రామన్నపేటకు సమీపంలోని మునిపంపుల గ్రామంలో చేనేత కుటుంబంలో జూన్ 28, 1976 లో జన్మించిన పెండెం చలాకిగా , నవ్వుతూ కనిపించే వ్యక్తి. అతడు గ్రామీణ జీవితాన్ని ఔపోసణ పట్టి కనిపించిన ప్రతి విషయాన్ని వస్తువుగా మలిచి కథలు సృష్టించాడు. చూసిన లేదా విన్న ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా మిత్రులతో చర్చించేవాడు. పెండెం జగదీశ్వర్ కథకుడు మాత్రమే కాదు ఆయనలో నిత్య బాలుడు కూడా దాగి ఉన్నాడు .మంచి కార్టునిస్ట్. వివిధ సందర్భాలలో పిల్లలు మాట్లాడుకునే ఇంటి భాషలో చర్చిస్తూ ఉండేవాడు. స్వచ్ఛమైన తెలంగాణ మాండలిక పదాలను పట్టుకుని పిల్లల కథలు రాయడంలో మంచి దిట్ట. కానీ పిల్లల సాహిత్యంలో గెలిచినప్పటికీ జీవితంలో స్వల్ప కాలంలోనే ఓడిపోయి హృదయాలలో జీవిస్తున్న విజేత మన పెండెం జగదీశ్వర్.
తొలి రోజుల్లో తెలంగాణ భాషలో ఎంతోమంది రచయితలు పిల్లల కథలను రాశారు . నేటి కాలంలో కూడా అనేక మంది రచయితలు బాల సాహిత్య ప్రక్రియలలో రాస్తూ ముందుకు వెళ్తున్నారు. బాల సాహిత్యం రాశిలోనూ పెరిగిన మాట వాస్తవమే . కుప్పలు కుప్పలుగా పుస్తకాలు పెరుగుతున్నాయి. అయితే రాసినదంతా నిలవడటం లేదు. కానీ అనాడే ప్రతిభావంతంగా జీవ భాషలో పిల్లల స్థాయికి అనుగుణంగా పిల్లలే కాదు పెద్దలు మెచ్చే విధంగా అనేక కథలు రాసి ఒక విలక్షణ శైలి సృష్టించారు పెండెం జగదీశ్వర్. మనకు తెలిసిన మన కథలను తెలంగాణ మాందలిక భాషలో చెప్పడం
జగదీష్ కు తెలిసినంత విద్య మరెవ్వరికీ తెల్వదని చెప్పవచ్చు. 1994 నుండి బాల సాహిత్యంలో రచనలు చేస్తున్న ఇతను ఆంధ్రప్రదేశ్ జానపద కథలు దగ్గర నుండి ఆనంద వృక్షం, గజ్జెల దయ్యం, పసిడి మొగ్గలు, వంకాయంత వొజ్రం, విడ్డూరాల బుడ్డోడు, నాకోసం ఎవలేడుస్తరు, నూట పదహారు నవ్వులు, తాను తీసిన గోతిలో, ముగ్గురు అవివేకులు, మాతో పెట్టుకోకు, దాగని నిజం, మతి మరుపు అల్లుడు, బంగారం చేసే విద్య, దొంగ స్వామిజీ, చిన్ని కోరిక వంటి వివిధ పుస్తకాలు రాశారు. అతడు రాసిన ప్రతి పుస్తకం పిల్లల్నే కాదు పెద్దలను సైతం ఆకర్షించే విధంగా మాత్రమే కాకుండా ఆలోచింపజేసే విధంగా ఉన్నవని కూడా చెప్పవచ్చును. పిల్లలంతా జగదీశ్వర్ రాసిన కథల కోసం పాఠశాలల్లో ఎదురు చూడటం జరిగేది.ఇంకా ఆయన వైజ్ఞానిక దృక్పథంతో కూడా అనేక కథలు రాశారు. ఏ కథ చదివినా ముచ్చుట పెడుతున్నట్లే అనిపిస్తది. పెండెం జగదీశ్వర్ కళాజాత బృందాల కోసం, ఆ నాటి వయోజన విద్యా ప్రచారం కోసం జన విజ్ఞాన వేదిక సభ్యునిగా హేతుబద్ధ దృక్పథంతో చిన్న చిన్న కథలు రాశారు. "గజ్జెల దయ్యం" పుస్తకంలో ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలు, భయాలపై లోతుగా ఆలోచింపజేశాడు. ప్రతి కథలో ఉన్న కారణాన్ని చూపిస్తూ ప్రజలను సహితం చైతన్యం చేశాడు. ఈ పుస్తకానికే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు బాల సాహిత్య పురస్కారం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ జిల్లా "జాబిల్లి" పిల్లల మాస పత్రిక సంపాదక మండలిలో ఇద్దరం కలిసి పని చేయడం మరిచిపోలేని అనుభూతి. పిల్లల కోసం నిరంతరం తపన పడుతూ వివిధ పాఠశాలల్లో పిల్లలు రాసిన మంచి మంచి కథలను, బొమ్మలను సేకరించి జాబిల్లి పత్రికలో ముద్రితం అయ్యేవిధంగా కృషి చేస్తూ పిల్లల్ని ప్రోత్సహించే వారు. ఆయన ఏది రాసినా, ఏది చేసినా ఒక వినూత్నంగా ఉండేది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినంక జగదీశ్వర్ రాసిన "బడి పిల్ల గాళ్ళ కథలు" ఇంటి భాషకు మహా గొప్పగా పట్టం కట్టాయి. అదేవిధంగా "విడ్డూరాల బుడ్డోడు" కథలు కూడా బాగా ఆకర్షిస్తాయి. సరదాగా అనిపించే ఈ కథలు ఎదుగుతున్న బాల్యాన్ని పరిచయం చేస్తాయి.తెలంగాణ మాండలికం అయిన కిత కితలను గమ్మతి గమ్మతిగా పదిలపరుచుకుంది. కష్టం, శ్రమ, గ్రామీణ జీవన సౌందర్యం లోని అంతరార్ధం , పరమార్ధం బాగా తెలిసినవాడు. అందుకే ప్రతి కథలో వాటిని ప్రతిబింబింప చేశాడు. గ్రామీణ కుల వృత్తులను సహితం కథలో చెప్పించి , పిల్లలు జాగరూకులు అయ్యే విధంగా సమయస్ఫూర్తిగా వివరించే తీరును విశ్లేషించ గలిగారు. జగదీశ్వర్ రాసిన అనేక కథలలో అద్భుతమైన హాస్యాన్ని పండింపజేశారు. తెలంగాణ ఇంటి భాష మళ్లీ ఒక కొత్త వెలుగు కోసం ఆత్మగౌరవ దిశగా పయనిస్తున్న సమయంలో పెండెం రాసిన కథలు కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి . తెలంగాణ మాండలికంలో కూడా ఇంతటి కమ్మదనం ఉంటుందా? అని కథలు చదివిన అందర్ని ఆలోచింపజేస్తాయి. సాధారణంగా రచయితలు అందరూ మెచ్చే విధంగా ఒకే తీరులో, ఒకే రీతిలో రాస్తుంటారు. కానీ పెండెం ప్రత్యేకత ఏమిటంటే ఇంట్లో మాట్లాడుకునే పదాలతో ఇంటి భాషలో రాయడం ఒక ప్రత్యేకత. ఊహకందని విషయాలను సుసాధ్యం చేసిన మంచి రచయిత. కథలలో అతడు ఉపయోగించిన పదాలు అతని సునిశిత పరిశీలన శక్తికి నిదర్శనం. పుంటి కూర, జల్ది, వుర్కుడు, చారాన, జరంత, గమ్మతి వంటి వందలాది మనం మరిచిపోయిన పదాలను ఈ తరానికి తెలియజేసే విధంగా జగదీశ్వర్ చేసిన కృషి ఎనలేనిది.పర్యావరణ స్పృహ ను కలిగిస్తూ జగదీశ్వర్ రాసిన "చెట్టు కోసం " కథను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం లోని ఆరవ తరగతి తెలుగు వాచకం లో పాఠ్యాంశంగా 2007-08 విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టింది. తెలంగాణ యవనిక మీద బలమైన వాగ్దానాల సంతకాలు చేసిన అతడు శాశ్వతంగా 42యేండ్ల అతి పిన్న వయసులోనే కనుమరుగైపోవడం అత్యంత విషాదకరం. తెలుగు సాహితీ లోకాన్ని దుఃఖ సముద్రంలోముంచి వెళ్లి పోయాడు.బాలజ్యోతి, బాలమిత్ర, బాలభారతి, బుజ్జయి వంటి పత్రికలలో అయన రాసిన ఎన్నో కథలు ముద్రితమైనయి. ఇంకా చెకుముకి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, వార్త, బతుకమ్మ, మొదలగు దిన, మాస పత్రికలలో అనేక వ్యాసాలు, కార్టున్లు ప్రచురింప బడినాయి. కథలో ఎలా గెలవాలో చెప్పినవాడు జీవితంలో తాను నిలువలేకపోయాడు. ఇంకా ఎంతో రాయాల్సిన వాడు, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగదలచిన వాడు పెండెం బౌతికంగా మన మధ్య లేకుండా పోయాడు. అయినప్పటికీ బాల సాహిత్యంలో ఆయన చెరగని ముద్ర వేశాడు.
బాల సాహిత్యానికే వన్నెతెచ్చిన పెండెం జగదీశ్వర్ కు అనేక సన్మానాలు, అవార్డులు లభించాయి. ఉత్తమ రచయితగా , కార్టూనిస్టుగా ఆనాటి కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి గారిచే సన్మానం పొందారు. కరీంనగర్ నుండి వాసాల నరసయ్య బాల సాహితీ పురస్కారం 2013లో లభించింది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే సత్కారం తీసుకున్నారు. 2014 లో అక్షర భారతి చౌటుప్పల్ వారి అక్షర సాహిత్య పురస్కారం పొందారు. ఇలా ఎన్నో సన్మానాలు సత్కారాలు స్వీకరించడం జరిగింది. తాను పనిచేసిన ప్రతిచోట వేలాది మంది విద్యార్థులకు , అనేకమంది మిత్రులకు ఆదర్శంగా నిలిచిన పెండెం సేవలు నిజంగా చిరస్మరణీయం. అందుకే ఆయన మరణానంతరం కూడా అతని ఆత్మీయులు, స్నేహితులు ఎంతోమంది ఆయన రాసిన బాల సాహిత్యాన్ని బతికించే విధంగా పెండెం జగదీశ్వర్ స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కారం ఇచ్చే కార్యక్రమంలో కీలక పాత్ర వహిస్తున్నారు . ఈ విధంగా ప్రతి యేటా బాల సాహిత్యంలో విశేష సేవలు కనబరిచిన తెలుగు రాష్ట్రాల నుండి ఒకరిని ఎంపిక చేసి నగదు, శాలువ, మేమెంటోతో పురస్కారం ప్రదానం చేస్తున్నారు. 2018లో పెండెం మరణించిన సంవత్సరంలో "బాల సాహిత్య రత్న" పేరుతో వ్యాస సంకలనం తీసుకొచ్చారు. ఇందులో అనేకమంది ప్రముఖులు పెండెం జీవితం పై, సాహిత్యం పై వ్యాసాలను రాశారు. 2020 నుండి పెండెం జగదీశ్వర్ పేరిట జాతీయ స్మారక పురస్కారాలను అందిస్తున్నారు. మొట్టమొదటగా సూర్యాపేట జిల్లాకు చెందిన పుప్పాల కృష్ణమూర్తి తొలుత ఈ పురస్కారం అందుకున్నారు. అనంతరం 2021లో చొక్కాపు వెంకటరమణ, 2022 లో వి.ఆర్. శర్మ, 2023లో దార్ల బుజ్జిబాబు, 2014లో గరిపెళ్లి అశోక్ వంటి ప్రముఖ బాల సాహితీవేత్తలు వరుసగా అందుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుతం 2025 సంవత్సరానికి గాను ప్రముఖ బాలసాహితీవేత్త విజయవాడకు చెందిన ముంజులూరి కృష్ణకుమారికి 6వ పెండెం జాతీయ బాల సాహిత్య పురస్కారం జూన్ 29న ఆదివారం నల్లగొండ పట్టణంలో జరిగే సమావేశంలో పురస్కారం పెండెం ఆత్మీయులు అందించనున్నారు. ఈ విధంగా బాల సాహిత్యానికి దండెంగా నిల్చిన పెండెం జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకుందాం.ఆయన కథలను భావి తరాలకు చేర వేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.
గమనిక : ఈనెల 29న పెండెం జగదీశ్వర్ స్మారక పురస్కారం ప్రధానోత్సవం సందర్భంగా....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి